హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పరువు దక్కించుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నది. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఆంధ్రా పార్టీలు, ఇతర పార్టీలతో అనైతిక పొత్తులు, అక్రమ సర్దుబాట్లకు సిద్ధపడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి ఎన్డీఏ కూటమి భాగస్వామి చంద్రబాబు మధ్యవర్తిత్వం చేసి అన్ని పార్టీలను ఏకం చేసి ఎగదోస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి పొత్తులతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయని సమాచారం. ముస్లిం ఓట్లను చీల్చడానికి ఎంఐఎం అభ్యర్థులను, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి బీజేపీ, జనసేన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనసేన తరఫున 332 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉండగా, వీరి గెలుపు గురించి పట్టించుకోని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్.. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయడానికి సిద్ధమవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
పొత్తుల గుట్టు.. ఏదులాపురంలో రట్టు
కాంగ్రెస్ పార్టీ అనైతికంగా ఎన్డీఏ కూటమి, ఇతర పార్టీలతో జరుపుతున్న స్నేహం ఇటీవల ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో బయటపడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాంగ్రెస్, జనసేన, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు తమ జెండాలు పట్టుకొని కనిపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం వారు ప్రయత్నం చేస్తున్న దృశ్యం వారి అనైతిక పొత్తులకు అద్దం పడుతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలను అందుకోవడంలో దెబ్బతిన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో తమదే పైచెయ్యి అనిపించుకోవడానికి ఇలా అక్రమ సర్దుబాట్లు చేసుకున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు పైకి కత్తులు దూస్తున్నట్టు నటిస్తూనే అంతర్గతంగా పొత్తులతో దోస్తీ కట్టినట్టు చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బద్దశత్రువులుగా కనిపించే బీజేపీ, ఎంఐఎం పార్టీలు తెలంగాణలో మాత్రం కలిసిపోయి, కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణతోపాటు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మెదక్, నారాయణపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్కు తిరుగులేని ఆధిక్యం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలు తేల్చినట్టు వార్తలొచ్చాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఆంధ్రా సీఎం చంద్రబాబు సంయుక్తంగా అన్ని పార్టీలను ఏకం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలని, దక్షిణ తెలంగాణలో టీడీపీ క్యాడర్ సంపూర్ణంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్టు చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ అనుకూల ఓటును ఏమార్చే ఎత్తుగడ
ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి బాసటగా నిలుస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో ముస్లింలతోపాటు కమ్యూనిస్టులు అండగా నిలబడటంతో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినట్టు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ అనుకూల ఓటు బ్యాంకుతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీల్చాలని వ్యూహకర్త సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించి వ్యూహం అమలుచేస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందులో భాగంగానే ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టారనే చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎంఐఎం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఉన్నచోట తమ అభ్యర్థులను నిలబెట్టడం వెనుక వారి మధ్య జరిగిన రహస్య సర్దుబాటు కారణమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు..
ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నించాలంటూ టీడీపీ క్యాడర్ చంద్రబాబు అంతర్గత ఆదేశాలిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించినా.. ప్రచారం కోసం పవన్ కల్యాణ్ మద్దతు కోరింది. మరోవైపు, పవన్‌కల్యాణ్ పార్టీ జనసేన తెలంగాణలో దాదాపు 332 స్థానాల్లో పోటీ చేస్తున్నది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఆయన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌లో 45 స్థానాలు, నల్లగొండలో 60, కరీంనగర్లో 65, ఆదిలాబాద్‌లో 38, మహబూబ్‌నగర్‌లో 30, రంగారెడ్డిలో 21, మెదక్‌లో 20, వరంగల్‌లో 30 స్థానాల్లో బరిలో ఉన్నది.
మిగతా జిల్లాల్లోనూ పలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నది. పవన్‌కల్యాణ్ వస్తుండటంతో వీళ్లందరి కోసం ప్రచారం చేస్తారని భావించగా.. ఆయన కేవలం బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమే ప్రచారం చేస్తారని అంటున్నారు. మరి సొంత పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? వారి కోసం ప్రచారం చేయనప్పుడు పోటీలో ఎందుకు నిలబెట్టారు? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటం కోసమే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. బీఆర్ఎస్కు పడే ఓటు చీలి జనసేనకు పడితే అంతిమంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందని వారు చెప్తున్నారు. ఇలా చంద్రబాబు కనుసన్నల్లోనే ఆంధ్రా పార్టీలన్నీ తెర వెనుక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ మీద కత్తులు దూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.