హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల ఉత్తుత్తి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తనిఖీల పేరిట హడావిడి చేస్తున్నాయి. తాజాగా నారాయణపేటలో కాంగ్రెస్ నేతలతోపాటు బీజేపీ నేత డీకే అరుణ ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి వర్గీయుల ఇండ్లలో సోమవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టెం పర్ణికరెడ్డి పోటీలో ఉన్నారు.
ఆమె డీకే అరుణకు మేనకోడలు. ఐటీ అధికారులు జూన్ నుంచే బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మంత్రి సబితతోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోపీనాథ్, జనార్దన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డితోపాటు వారి బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గెలవలేకనే బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.