న్యూఢిల్లీ, జనవరి 2: ‘నీట్-యూజీ’ పరీక్ష నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటుచేసిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అమలుజేయబోతున్నట్టు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. గత ఏడాది ‘నీట్-యూజీ’ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ పనితీరును సమీక్షించిన నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించిందని, పలు దిద్దుబాటు చర్యల్ని సూచించినట్టు కేంద్రం గురువారం పేర్కొన్నది. కమిటీ సిఫారసులన్నీ అమలుజేస్తున్నట్టు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు.
నీట్-యూజీ-2024 పరీక్షపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ర్టాల్లో నిర్వహించిన పరీక్షలో ఓ ప్లాన్ ప్రకారం మాల్‌ప్రాక్టీస్, పేపర్ లీకేజ్ జరిగిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఆరోపణలపై సరైన ఆధారాలు లేవని పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు సంబంధించి నిపుణుల కమిటీ ఏర్పాటుచేసింది.