నిన్నటి వరకు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంటూ హడావుడి. ఆ ప్రణాళికను విరమించుకుని తాజాగా తెరమీదికి పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు. లింక్ ఏదైనా అందులోని అసలు మర్మం మాత్రం తెలంగాణకు కన్నీళ్లు మిగల్చడమే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీఏసీ (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) అనుమతులకు విరుద్ధంగా, పరిమితికి మించి రెట్టింపు సామర్థ్యంతో నిర్మించిన కాలువలను చట్టబద్ధం చేసుకునే కుట్రే. దానికి కేంద్ర ప్రభుత్వం సైతం వత్తాసు పలకడం మరో మోసం. మొత్తంగా అటు ఏపీ సర్కార్, ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కలిసి తెలంగాణ నోట్లో మట్టికొట్టేందుకే వ్యూహాలు.
హైదరాబాద్, డిసెంబర్14(నమస్తే తెలంగాణ): సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) నిర్మించాలని 1978లో ప్రణాళికలను రూపొందించింది. ఆ మేరకు నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట డీపీఆర్‌ను సమర్పించింది. ఆ వివరాల ప్రకారం 150 ఫీట్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో పోలవరం వద్ద డ్యామ్‌ను నిర్మించాలి. ప్రాజెక్టు ఎండీడీఎల్‌ను 145 అడుగులుగా, డ్యామ్ లైవ్ స్టోరేజ్ 28.31 టీఎంసీలుగా ఉండాలి. డ్యామ్ నుంచి కుడి కాలువను (పోలవరం-ప్రకాశం బరాజ్) 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వి గోదావరి జలాలను కృష్ణా రివర్‌కు కలుపాలి.
ఏపీ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనలపై గోదావరి బేసిన్లో భాగమైన నాటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో గోదావరి నుంచి మళ్లించే జలాల్లో రైపేరియన్ రాష్ర్టాలకు వాటాలు పంచడంతోపాటు, ఇతరత్రా షరతులతో ఆ ప్రతిపాదనలకు బచావత్ ట్రిబ్యునల్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం క్షేత్రస్థాయిలో ట్రిబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా ప్రాజెక్టు, కాలువ నిర్మాణ సామర్థ్యాలను విస్తరించుకుంటూపోతూనే ఉన్నది.
టీఏసీ నాటికే కాలువ సామర్థ్యం పెంపు
1980లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బచావత్ ట్రిబ్యునల్ అనేక షరతులతో అనుమతులు మంజూరు చేసింది. మొత్తంగా గోదావరి నుంచి 80 టీఎంసీల జలాలను కృష్ణా (విజయవాడ ప్రకాశం బరాజ్)కు మళ్లించాలి. అనంతరం ఈ లింక్‌ను నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ (ఎన్పీపీ)లో భాగంగా కేంద్రం నదుల అనుసంధానం కింద చేర్చింది. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలను విస్తరించింది. టీఏసీకి (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) సమర్పించే సమయంలో డ్యామ్ ఎండీడీఎల్‌ను 145 నుంచి 141 ఫీట్లకు కుదించి లైవ్ స్టోరేజీ కెపాసిటీని 28.31 నుంచి 75 టీఎంసీలకు పెంచింది.
కుడి కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కుల నుంచి 12,250 క్యూసెక్కులకు విస్తరించి, 2011లో టీఏసీ అనుమతులను సాధించింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోనూ ఆ సామర్థ్యాలకే టీఏసీ ఆమోదం పొందినట్లు తేల్చిచెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ చట్టాన్ని తుంగలో తొక్కి 2019లో ఏకంగా 17,540 క్యూసెక్కులకు నిర్మాణం చేపట్టింది. తాజాగా పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టులో భాగంగా అదే కాలువ సామర్థ్యాన్ని మరో 5,000 క్యూసెక్కులకు విస్తరించేందుకూ కుట్రలు చేస్తున్నది. మొత్తంగా కుడికాలువ సామర్థ్యాన్ని 23,000 క్యూసెక్కుల (2టీఎంసీల)కు ప్రణాళికలను సిద్ధం చేసింది. పైగా, కుడికాలువకు సంబంధించి సిద్ధాపురం వద్ద చేపట్టిన జంట సొరంగాలను 20 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి రెట్టింపు అంటే 40 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తుండడం గమనార్హం.
చట్టబద్ధతే పీఎన్ఎల్పీ అసలు మర్మం
పోలవరం ప్రాజెక్టులో భాగమైన కుడికాలువ పోలవరం- విజయవాడ లింక్ ఎన్పీపీలో ప్రతిపాదించిన రివర్ లింక్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు. ఆ తరువాత కేంద్రం 2014లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి, ప్రస్తుతం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తున్నది. వాస్తవానికి టీఏసీ అనుమతులకు అనుగుణంగా జరిగే ప్రాజెక్ట్ పనులకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ సర్కారు ఇప్పటికే టీఏసీ అనుమతులకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి, డ్యామ్, లైవ్స్టోరేజ్ మొదలు కాలువల సామర్థ్యం వరకు అంతకంతకూ విస్తరించుకుంటూ పోతూనే ఉన్నది. కాగా, ఏపీ చేపట్టిన నిర్మాణాలకు అనుగుణంగా టీఏసీని సవరించాలి, అందుకు కోబేసిన్ రాష్ర్టాల సమ్మతి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.
కానీ ఇప్పుడు ఆయా రాష్ర్టాలు ఆమోదించే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటికే చేపట్టిన అదనపు, అనధికార నిర్మాణ సామర్థ్యాలను చట్టబద్ధం చేసుకునేందుకు ఏపీ కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. అందులో భాగంగా గోదావరి-కావేరి లింక్‌ను పోలవరం నుంచే చేపట్టాలని పట్టుబడుతూనే మరోవైపు గోదావరి బనకచర్ల లింక్‌కు ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనలపై సొంత రాష్ట్రంలోనే విమర్శలు రావడంతో తాత్కాలికంగా విరమించుకున్నది. ఇప్పుడు అదే తరహా పోలవరం – నల్లమలసాగర్ లింక్‌ను తెరమీదికి తీసుకొచ్చి, ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నది. పర్మిషన్లు వస్తే ఇప్పటి వరకు చేపట్టిన అనధికార నిర్మాణాలన్నీ చట్టం అవడమే కాకుండా ఆ నిధులను కేంద్రం నుంచి రాబట్టుకోవచ్చు అనేది ఏపీ అసలు మర్మంగా తెలుస్తున్నది.
కేంద్రంలో మోదీ సర్కారు వత్తాసు
ఏపీ సర్కారు ప్రణాళికలన్నింటికీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నది. టీఏసీ అనుమతులకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నదని రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి తెలంగాణ కేంద్ర జల శక్తిశాఖ, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీకీ ఫిర్యాదులు చేస్తూనే ఉంది., అనధికార నిర్మాణాలను నిలువరించాలని డిమాండ్ పెంచుతూనే ఉన్నా కేంద్ర సర్కారు మాత్రం ఇప్పటికీ వాటిపై చర్యలు చేపట్టలేదు, కనీసం స్పందించిన దాఖలాలూ లేవు. పైగా, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా చేపట్టేందుకు సిద్ధమైన పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టుకు వత్తాసు పలుకుతున్నది. ఏకంగా ఆ లింకు ప్రాజెక్టును ఇప్పుడు ఎన్పీపీ (నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్)లో చూపడమే అందుకు నిదర్శనం. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్ వేదికగా స్పష్టంగా చేసింది. ఎన్పీపీలో భాగంగా ఏపీకి సంబంధించి లింక్ ప్రాజెక్టుల వివరాలను, వాటి పురోగతిని తెలుపాలని ఏపీ ఎంపీ పార్లమెంట్లో ప్రశ్నించగా, అందుకు కేంద్ర జలమంత్రిత్వశాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమాధానమివచ్చారు.
ఏపీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదించిన 7 రివర్ లింక్ ప్రాజెక్టులను వివరించారు. వాటికి అదనంగా ఏపీ కొత్తగా పోలవరం- బనకచర్ల లింక్ పీఎఫ్ఆర్ను సమర్పించిందని కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. ఈ లింక్‌ను కూడా ఎన్పీపీలో చూపడంతో కేంద్రం సైతం ఏపీ ప్రతిపాదనలకు వత్తాసు పలుకుతున్నదని తేటతెల్లమవుతున్నది. ఇదిలా ఉండగా ఏపీ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టులో కొన్ని లింకులను తాత్కాలికంగానే మార్పులు చేసింది. జీబీ లింక్‌లో గోదావరి నుంచి జలాలను ప్రకాశం, బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్లకు తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుత పీఎన్ లింక్‌లో జలాలను బొల్లాపల్లి వరకు యథావిధిగా తరలించి, అక్కడి నుంచి బనకచర్లకు కాకుండా నల్లమలసాగర్‌కు తరలిస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యం యథాతథంగా కొనసాగుతున్నది.
తాడిపూడి కెనాల్ 18 వేల క్యూసెక్కులకు విస్తరణ
పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ఆయకట్టుకు నీటిని అందించేందుకు కేవలం తాత్కాలిక ప్రాతిపదికపై ఉమ్మడి ఏపీ సర్కారు 2006లో తాడిపూడి లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తాడిపూడి నుంచి 1,400 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించింది. పోలవరం కుడికాలువకు సమాంతరంగా 80 కి.మీ కాలువను గతంలోనే తవ్వింది. అంతేకాదు తాడిపూడి కెనాల్‌ను పోలవరం కుడికాలువతో అనుసంధానించి గోదావరి జలాలను మళ్లిస్తున్నది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తరువాత తాడిపూడి లిఫ్ట్‌ను తొలగించి, కుడికాలువ నుంచే తాడిపూడి కెనాల్‌కు నీటిని మళ్లించి ఆయకట్టుకు అందివ్వాలనేది నిబంధన. కానీ ఏపీ సర్కారు ప్రస్తుతం ఒకవైపు కుడికాలువను పరిమితికి మించి సామర్థ్యంతో నిర్మించడమే కాకుండా, మరోవైపు పోలవరం నల్లమలసాగర్ లింక్ పేరిట తాడిపూడి కెనాల్‌ను కూడా భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. 1,400 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులకు కాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అలాగే 80 కి.మీ పొడవున్న తాడిపూడి కెనాల్‌ను అక్కడి నుంచి పోలవరం కుడికాలువకు సమాంతరంగా మరో 105 కి.మీ వరకు అంటే సుమారు ప్రకాశం బరాజ్ వరకు పొడిగించేందుకు రెడీ అయ్యింది.
పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంపు ఇలా
తాడిపూడి కెనాల్