హిమాయత్‌నగర్, సెప్టెంబర్13: కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 10మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. 21నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట 72సార్లు ఎన్కౌంటర్లు చేయగా, 670 మందికి పైగా చనిపోయారని, ఇందుల్లో ఆదివాసీలు, అమాయక ప్రజలే అధికంగా ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని పౌ ర సమాజం ఘోషిస్తున్నా.. ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తుందని మండిపడ్డా రు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగాన్ని సైతం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు.