హైదరాబాద్, జూలై 9(నమస్తేతెలంగాణ): కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్రకార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో బీఆర్ఎస్కేవీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఆర్టీసీ కార్మిక సంఘాలు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ ప్రైవేట్‌పరం చేస్తున్నారని విమర్శించారు. వ్యతిరేకించాల్సిన తెలంగాణ ప్రభుత్వం కూడా 10 గంటలు పనిచేయాలని సర్క్యులర్ జారీచేసిందని మండిపడ్డారు. బ్యాంకులను విలీనం చేసి అందులోని సిబ్బందిని 8 లక్షలకు కుదించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈదురు వెంకన్న, ఎం థామస్‌రెడ్డి, కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, రవీందర్‌రెడ్డి,టీడబ్ల్యూజేఎఫ్ నేతలు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య, బీ రాజశేఖర్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహ, ఎంఎస్ నాయకుడు రెబ్బ రామారావు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యోగులు విధులు బహిష్కరించి ని రసన తెలిపారు. తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతమైనట్టు జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు తెలిపారు. కో-చైర్మన్లు బీసీ రెడ్డి, శ్రీధర్, సదానందం, నెహ్రునాయక్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన దొం గతుర్తి జీపీ కార్మికుడు ఆకుల రాజయ్య (60) తీవ్ర అస్వస్థతకు గురికాగా, వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.