న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరుగుతుండటం, ఖరీఫ్ సీజన్లో ఉల్లి దిగుమతి తగ్గొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఎగుమతులపై నిషేధం విధించినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో కిలో ఉల్లి రూ.80 వరకు పలుకుతున్నది. గత ఆగస్టులో కూడా ఉల్లి ఎగుమతులపై ఎగమతి పన్నును కేంద్రం 40 శాతానికి పెంచింది. ఎగుమతులను నిషేధించటంపై ఉల్లి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముంబై-ఆగ్రా రహదారిని వందలమంది రైతులు అనేకచోట్ల దిగ్బంధించారు. అతిపెద్ద ఉల్లి మార్కెట్లయిన లసల్గావ్, నందగావ్, పింపాల్‌గావ్, ఉమరాణెల్లో రైతులు నిరసనలు చేపట్టారు. దీంతో మార్కెట్లలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. జైఖేడా, చంద్వాడ్, ముంగ్సేలో కూడా రైతులు ట్రాక్టర్లలో నిరసన ర్యాలీలు నిర్వహించారు.