హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ప్రధాని నరేంద్రమోదీ అనుమతితో మంగళవారం సంతకం చేసినట్టు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ కోల్‌బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. 2020 నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక్క బొగ్గు బ్లాక్ కూడా కేటాయించలేదని, అయినప్పటికీ సింగరేణి సంస్థ కోసం తాము ప్రత్యేక చొరవ తీసుకున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ బొగ్గు బ్లాక్‌ను వేలం పాట ద్వారా కాకుండా నేరుగా కేటాయించడం వల్ల ఆక్షన్ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, దీంతో సింగరేణికి రూ.2,550 కోట్లు మిగులుతుందని, రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.16 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వివరించారు. బొగ్గు ఉత్పత్తి పెంచడంతోపాటు సింగరేణి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ కోల్ బ్లాక్‌తో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంటూ.. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రెండేండ్ల తర్వాతే ఉత్పత్తి?
తాడిచెర్ల కోల్ బ్లాక్-1ను టీజీ జెన్కోకు కేటాయించారు. ఇదే బ్లాక్ సమీపంలోని కోల్ బ్లాక్-2ను సింగరేణికి కేటాయించారు. దాదాపు 612 మిలియన్ టన్నుల నిక్షేపాలున్న ఈ కోల్ బ్లాక్ నుంచి ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 40-50 ఏండ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఈ బ్లాక్‌లో నాణ్యమైన జీ-8, జీ-9 గ్రేడ్ బొగ్గు లభిస్తుందని, దాన్ని ఎన్టీపీసీ, కేటీపీపీ, వైటీపీఎస్ లాంటి సంస్థలకు సరఫరా చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి ఏటా సగటున 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. తాజాగా తాడిచెర్ల కోల్ బ్లాక్-2 సింగరేణి సిగలో చేరడంతో సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 70 మిలియన్ టన్నులకు చేరుతుంది. తాడిచెర్ల-2 బ్లాక్‌ని 1,875 హెక్టార్ల భూమిలో 1,600 హెక్టార్ల అటవీ భూమి ఉన్నది. దీంతో అటవీ అనుమతులు, మైనింగ్ ప్లాన్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొంది ఈ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు రెండేండ్లకుపైగా సమయం పడుతుందని సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు.
జెన్కోకు ఆశాభంగం
తాడిచెర్ల-2 బ్లాక్‌ను సొంతం చేసుకునేందుకు టీజీ జెన్కో తీవ్ర ప్రయత్నాలు చేసింది. తాడిచెర్ల-1 బ్లాక్ జెన్కో సొంతం కావడంతో రెండో బ్లాక్‌ను సైతం తమకే కేటాయిస్తారని ఆ సంస్ధ భావించింది. కానీ, చివరికి ఆ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంతో జెన్కోకు ఆశాభంగం తప్పలేదు.