Bayyaram Steel Plant | హైదరాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని మాత్రం విస్మరించింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించేందుకు సిద్ధపడిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు రూ.30 వేల కోట్లకుపైగా ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
మొదటి విడతలో రూ.11 వేల కోట్ల పైచిలుకు ప్యాకేజీని ప్రకటించింది. అదే సమయంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నప్పటికీ, కేంద్రం ఆ దిశగా ఆలోచించకపోవడం తెలంగాణపై ప్రదర్శిస్తున్న వివక్షకు అద్దం పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కానీ, రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు కానీ నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
బయ్యారం ప్రాంతంలో 1.41 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భారీగా ఐరన్‌ఓర్ నిల్వలు ఉన్నట్టు గతంలో గుర్తించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా తక్కువ ధరకే ఇనుము ఉత్పత్తి కావడంతోపాటు స్థానికంగా వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉన్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పొందుపర్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు 11 ఏండ్లుగా ఈ విషయా న్ని నాన్చుతున్నది.
దీనిపై కేసీఆర్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినా, ప్రధానిని కలిసినా ఫలితం లేదు. బయ్యారంలో సమృద్ధిగా ఐరన్‌ఓర్ నిల్వలున్నా, నాణ్యతలేదని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్రం చెప్తున్నది. విశాఖ ఉక్కుకు ఇనుప గనులే లేవు. 600 కిలోమీటర్ల దూరంలోని ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లా నుంచి ఐరన్‌ఓర్‌ను సరఫరా చేస్తున్నారు. బయ్యారం నుంచి బైలాడిల్లా కేవలం 160 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.
ఛత్తీస్‌గఢ్ నుంచి 100 మిలియన్ టన్నుల ఐరన్‌ఓర్‌ను రాష్ర్టానికి కేటాయించి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవచ్చని బీఆర్ఎస్ సర్కారు అనేకసార్లు కేంద్రానికి విన్నవించింది. బయ్యారం, లేక దాని పరిసర ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు ఎన్ఎండీసీ గతంలో ముందుకొచ్చింది. మరోవైపు బయ్యారానికి ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి కూడా ఐరన్‌ఓర్‌ను సరఫరా చేసే వీలున్నది. రవాణా ఖర్చు లు తగ్గి తక్కువ ధరకే స్టీల్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. స్థానికంగా ఉన్న ఐరన్‌ఓర్‌ను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది.
విశాఖపట్టణంతో పోల్చుకుంటే బయ్యారానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ, కేం ద్రం మాత్రం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు సుముఖంగా లేదు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ సర్కారు పదేండ్లపాటు నిర్విరామంగా పోరాడింది. అయినా తెలంగాణ పట్ల మొదటినుంచీ వివక్షాపూరిత వైఖరిని అవలంబిస్తున్న బీజేపీ సర్కారు మనసు కరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొలువుదీరిన కాం గ్రెస్ సర్కారు.. అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఇంతవరకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హయాంలో ఆమోదం పొందిన విభజన బిల్లును అమలు చేయించేందుకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఎటువంటి ప్రయత్నాలూ చేయడంలేదు. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎంపీ లు, వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ బయ్యారం స్టీల్ గురించి నోరు మెదపడంలేదు. నష్టాల్లో కూరుకుపోయి విక్రయించేందుకు సిద్ధమైన విశాఖకు భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రస్తుత సందర్భంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని కేంద్రానికి గుర్తుచేయడం సర్కారుతోపాటు బీజేపీ ఎంపీల బాధ్యత.
గతంలో నష్టాల పేరుతో విశాఖ ఉక్కు ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు చేపట్టిన ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తే, దానిని కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని ప్రకటించడమే కాకుండా, బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాలను పరిశీలించాలని సింగరేణి అధికారులను విశాఖకు పంపారు. అయితే, అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ, విపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కానీ కేంద్ర వైఖరిపై మౌనం వహించారు.
బీఆర్ఎస్ పోరాటంతో చివరికి ప్రైవేటీకరణ యత్నాల నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. దీంతో విశాఖ ఉక్కు కార్మికులు కేసీఆర్‌ను ఎంతగానో కొనియాడారు. కేసీఆర్ రంగంలోకి దిగడంతోనే కేంద్రం వెనక్కు తగ్గిందని, లేకుంటే అప్పుడే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగేదని రాజకీయవర్గాలతోపాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చెప్తున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎంతగా పోరాడుతున్నదో, అంతే స్థాయిలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా కూడా పోరాడింది.