HCU | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ‘మీకు ఫారెస్టు చట్టాల మీద కనీస అవగాహన ఉన్నదా? రాత్రికిరాత్రే అన్నేసి బుల్డోజర్లతో చెట్లు, పక్షులు, ప్రాణుల అంచనా లేకుండా విధ్వంసం చేస్తరా? ప్రత్యక్షంగా చూస్తుంటేనే గుండె తరుక్కుపోతున్నది.. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మీరు అటవీ ఆవాసం మీద స్వైర విహారం చేస్తుంటే మీకు పోలీసులు రక్షణ వలయంగా వచ్చారు. ఈ రాష్ట్రంలో అటవీశాఖ ఉన్నదా? ఇక్కడ రాజ్యాంగం నడుస్తున్నదా?’
అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపడ్డట్టు తెలిసింది. హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం కంచ గచ్చిబౌలిలోని భూములను పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రప్రకాశ్ గోయల్, మహారాష్ట్ర మాజీ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సునీల్ లిమయే సుమారు గంట పాటు అడవి అంతటా తిరిగి అక్కడి వాస్తవ పరిస్థితిని అంచనా వేశారు. అడవిలోని వృక్ష సంపద, వన్యప్రాణుల ఆనవాళ్లపై అధ్యయనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో దాదాపు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. 400 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను అధికారులు కమిటీకి సమర్పించారు. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, టీజీఐఐసీ అధికారులు హాజరైనట్టు తెలిసింది.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించిందని, ఈ భూమితో హెచ్సీయూకు ఎలాంటి సంబంధం లేదని ఎంపవర్డ్ కమిటీకి ముఖ్యకార్యదర్శి నివేదించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కింద ఉన్న ఈ భూములను అభివృద్ధి పనుల కోసం టీజీఐఐసీకి అప్పగించినట్టు నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ఆ భూముల్లో అడవి లేదని, భూమి వినియోగంలో లేకపోవడంతో మొక్కలు పెరిగాయని, త్వరితమైన పట్టణీకరణ వల్ల సిమెంటు వ్యర్థాలు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పడేసిన బండరాళ్లు, చెత్తా చెదారం కలిసి గుబురుగా తయారైనట్టు నివేదికలో పేర్కొనట్టు సమాచారం.
వన్యప్రాణులు లేవని, అసలు అది వన్యప్రాణులకు నివాసయోగ్యమైన ప్రాంతం కాదని నివేదించినట్టు తెలిసింది. తాము తొలగించిన చెట్లలో 90 శాతం తుప్పలు, మరో 10 శాతం సుబాబుల్, యూకలిప్టస్ చెట్లు మాత్రమేనని నివేదించినట్టు సమాచారం. ఈ తుప్పల్లో వన్యప్రాణులు ఏమీ లేవని, ప్రభుత్వమంటే గిట్టని ప్రతిపక్షాలు ఏఐ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది.
అమూల్యమైన డీమ్డ్ ఫారెస్టును విధ్వంసం చేయటంలో ఫారెస్టు శాఖ నిర్లక్ష్యం, టీజీఐఐసీ తెంపరితనం ఉన్నదని కమిటీ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జింకలు చనిపోయినట్టు మీడియాలో చూశామని, అది వాస్తవమేనా? అని నిలదీసినట్టు తెలిసింది. ‘అన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తున్నాం.. బాధ్యులపై కచ్చితంగా చర్యలుంటయి’ అని హెచ్చరించినట్టు సమాచారం. ఒక దశలో ‘మీపై క్రిమినల్ కేసులు తప్పవు’ అంటూ హెచ్చరించడంతో ఫారెస్టు, టీజీఐఐసీ అధికారులు ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వ నివేదకపై అభ్యంతరం వ్యక్తం చేసిన కమిటీ.. భూములు ఎవరి యాజమాన్యం కింద ఉన్నాయనేది అప్రస్తుతమని, అది డీమ్డ్ ఫారెస్టా? కాదా? అన్నదే ప్రధానమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ రాష్ట్రంలో ఫారెస్టు శాఖ పని చేస్తున్నదా? అనే సందేహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంత పెద్ద ఆవాసం విధ్వంసానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వృక్షజాలం ఎంత? జంతుజాలం ఏమిటి అనే మదింపు అవసరం లేదా? అని పీసీసీఎఫ్ అధికారిని నిలదీసినట్టు తెలిసింది. తక్కువ సంఖ్యలో చెట్లు ఉన్నాయని, పక్షులు, వన్యప్రాణులు లేవని మదింపు లేకుండా ఎలా నివేదిక తయారు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
చెట్ల వయస్సు, జాతికి సంబంధించిన సమగ్ర నివేదిక తక్షణమే ఇవ్వాలని అడిగినట్టు తెలిసింది. గూగుల్ మ్యాపులు, ఫారెసు ్ట ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(ఎఫ్‌ఐఎంఎస్)లను చూస్తే అక్కడ దట్టంగా విస్తరించిన పచ్చదనం కనిపిస్తున్నదని, తాము క్షేత్రంలో తిరిగినప్పుడు 20 నుంచి 40 సంవత్సరాల పైబడిన మొక్కలు, వాటి ఆనవాళ్లు గుర్తించామని చెప్తూ తప్పుడు సమాచారంతో తమను తప్పుదోవ పట్టించాలనుకోవడం క్రిమినల్ అఫెన్స్ అవుతుందని గట్టిగా నిలదీసినట్టు తెలిసింది. విద్యార్థుల కోరిక మేరకు మరోసారి పరిశీలనకు వస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.