హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పలు రాష్ర్టాల్లో నగదు, మద్యంతోపాటు డ్రగ్స్‌ను కూడా పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో డ్రగ్స్ సహా ఇతర వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 20 శాఖల అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కంటాక్స్, జీఎస్టీ, ఈడీ, నార్కోటిక్స్, డీజీసీఐ, అటవీ తదితర 20 శాఖల అధికారులు ఉంటారు. వీరందరూ ఎప్పటికప్పుడు సమావేశమవుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్, అక్రమ రవాణాలు జరగకుండా, పంపిణీ చేయకుండా చూ స్తారు. పట్టుబడిన కేసుల్లో అధికారిక ప్రక్రియను పూర్తి చేయడంలో వీరి సహాయం తీసుకుంటారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత హెలిప్యాడ్, హెలికాప్టర్‌లోనూ విస్తృతంగా చెకింగ్లు చేయనున్నారు. విమానాశ్రాయాల్లోనూ డ బ్బు తరలింపుపై దృష్టి పెడుతారు. వ్యాపారులు రవాణా చేసే డబ్బుకు సంబంధించి జీఎస్టీ బిల్లులను పరిశీలించడానికి జీఎస్టీ అధికారులు కూడా ఈ కమిటీలో ఉండనున్నారు.
రాష్ట్రంలో పోలీసు బందోబస్తుకు దాదాపు లక్ష మంది పోలీసులు అవసరమని అంచనా వేశారు. రాష్ట్ర సరిహద్దు రాష్ర్టాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో దాదాపుగా 80పైగా చెక్‌పోస్టులను ఏర్పాటుచేయాలని పోలీసులు నిర్ణయించారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బందితోపాటు ఇతర రాష్ర్టాల పోలీసులు, కేంద్ర బలగాలు రాష్ర్టానికి రానున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి పోలీసు అధికారులకు సైతం శిక్షణను ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు శిక్షణను పూర్తి చేశారు. ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా శిక్షణ ఇవ్వనున్నారు.