హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందేందుకు ఆరేండ్లు నిండి ఉండాలన్న నిబంధన ఎందుకు పాటించడం లేదని కేంద్ర విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధనను పాటించాలని ఆదేశించింది. ఇక ఎన్ఈపీ అమల్లో భాగంగా 5+3+3+4 విద్యావిధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని సూచించింది. 2026-27 విద్యాసంవత్సరం సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అఫ్రూవల్ బోర్డు(పీఏబీ) మినట్స్‌ను కేంద్రం బుధవారం విడుదల చేసింది.
2026-27విద్యాసంవత్సరంలో మొత్తం రూ. 1,640.85కోట్లు ఖర్చుచేసేందుకు కేంద్రం ఆమోదించింది. కేంద్ర వాటాగా రూ.984.51కోట్లు, రాష్ట్రవాటాగా రూ.656.34కోట్లు, స్పిల్ ఓవర్‌గా రూ.135.61కోట్ల చొప్పున ఖర్చుచేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎలిమెంటరీ విద్యలో రూ.812కోట్లు, సెకండరీ విద్యలో రూ.923 కోట్లు, టీచర్ ఎడ్యుకేషన్‌కు రూ.23.92 కోట్ల చొప్పున ఖర్చుచేసేందుకు అనుమతిచ్చింది.
రాష్ట్రంలో వార్షిక సగటు డ్రాపౌట్ రేట్ సెండరీ విద్యలో ఆందోళన కలిగిస్తున్నది. ఈ డ్రాపౌట్ రేట్ 2023 -24లో 8శాతం ఉండగా, 2024-25కు వచ్చేసరికి 10.5 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 8.2 శాతంతో పోల్చితే ఇది అత్యధికమని పీఏబీ నివేదిక వెల్లడించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో డ్రాపౌట్ రేట్ తక్కువగా ఉండగా, సెకండరీ స్థాయిలో ఎక్కువగా ఉండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. డ్రాపౌట్ రేట్ పెరుగుదలకు గల కారణాలను అన్వేషించి, తిరిగి కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతున్నదని, దీనికి గల కారణాలను అన్వేషించాలని రాష్ర్టానికి సూచించింది.