పెద్దపల్లి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి చెమటోడ్చి పనిచేస్తున్నా జాలి, దయ లేకుండా ప్రవరిస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు కేంద్రం విధిస్తున్న ఐటీ గుదిబండలా మారింది. ఏసీ గదుల్లో పనిచేసే ఉద్యోగులను ఏ విధంగా పరిగణిస్తున్నారో.. నేలమ్మ ఒడిలో దుబ్బ, ధూళి బుక్కి ప్రతి నిమిషం ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులపైనా అదే రీతిన పన్ను విధిస్తున్నాయి. సింగరేణి కార్మికుల కష్టాలను, కన్నీళ్లను గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో ఐటీ మినహాయింపు ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రభుత్వం చలించలేదు. బొగ్గుగనులు విస్తరించి ఉన్న రాష్ర్టాల్లోనే ఏ కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఆ ఆలోచనే చేయలేదు. పార్లమెంటులోనూ చర్చించలేదు. తీర్మానానికి ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల నిర్లక్ష్యం సింగరేణి కార్మికుల కడుపు కొడుతున్నది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు ఇచ్చేందుకు కృషి చేయాలని కార్మికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సింగరేణి కార్మికుడు ఏడాది పనిచేస్తే ఐటీ పోటుతో తొమ్మిది నెలల జీతం మాత్రమే పొందుతున్నాడు. మూడు నెలల జీతాన్ని కేంద్ర ప్రభుత్వమే కొట్టేస్తున్నది. అండర్ గ్రౌండ్ కార్మికుడికి మాత్రం ఐటీ నుంచి కేవలం పదివేలు మాత్రమే మినహాయిస్తున్నారు తప్ప, మిగతా వసూళ్లన్నీ యథాతథంగా జరుగుతున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంటు, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు కోల్ఇండియా మాదిరి ఇక్కడ ఐటీ మినహాయింపునకు కృషి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి, చేతులెత్తేసింది. 22 నెలలైనా కనీసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటులో చర్చించలేదు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గుర్తింపు సంఘం సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం కాంగ్రెస్ అనుబంధ ఐన్టీయూసీలు గెలువగా, కార్మికులకు ఇచ్చిన ఐటీ మినహాయింపు హామీ అటకెక్కింది. 2023-24, 2024-25 ఆదాయ పన్ను సింగరేణి ఉద్యోగుల వేతనం నుంచి కోత పెట్టారు. గతేడాది జీతాల్లో ఆదాయ పన్ను 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు ఆప్షన్లను ఇచ్చి కోత విధించింది. గతేడాది కొంత ఐటీ తగ్గినా, ప్రయోజనకరంగా లేదని కార్మికులు పెదవి విరిచారు. ఆదాయ పన్నుపై కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి మినహాయింపు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఆదాయ పన్నుపై పెదవి విప్పకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సింగరేణి కార్మికులు ఏటా సుమారు వెయ్యి కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. కార్మికుల కష్టం ప్రభుత్వాల ఖజానాల్లోకి వెళ్తున్నది. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వారి శ్రమ వృథా అవుతున్నది. 2025 నూతన బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబులు పెరిగి, దాదాపు రూ.500 కోట్లు మినహాయింపు లభించిన్నప్పటికీ అది పెద్దగా కార్మికుల్లో ఆనందాన్ని మిగల్చలేదు. కార్మికుల ఆదాయంపై పన్ను కోత విధింపును కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సింగరేణిలో 40 వేల మంది రెగ్యులర్ కార్మికులు పనిచేస్తుండగా, వారిలో 15 వేల మంది సీనియర్ కార్మికులు అధిక గ్రేడ్‌కు చెందిన వారే ఉన్నారు. విభిన్న గ్రేడ్లలో చిన్న మొత్తానికి (రూ.12 లక్షల ఆదాయం వరకూ) వచ్చే కార్మికులకు పన్ను మినహాయింపులు లభిస్తున్నప్పటికీ, వార్షిక ఆదాయం రూ.12 లక్షలకు మించి ఉన్న వారిపై పన్ను ప్రభావం పడక తప్పడం లేదు. ఏడాదికి రూ.2 లక్షలు నుంచి రూ.4 లక్షలు వరకు ఐటీ కింద సింగరేణి కార్మికులు కట్టాల్సి వస్తున్నది. ప్రధానంగా బోనస్, లాభాల వాటా, నెలవారీ వేతనాలు కలిపి సీనియర్ కార్మికులకు దాదాపు రూ.20 లక్షల వరకు వార్షిక ఆదాయం లభిస్తున్నది. దీంతో ఐటీ అత్యధికంగా పడుతున్నది.ప్రధానంగా 2025 నూతన స్లాబ్‌ల నేపథ్యంలో సగటు ఆదాయంలో ఉన్న కార్మికులకు మినహాయింపు లభిస్తే, అధిక ఆదాయం ఉన్న వారికి మాత్రం పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. ఒకో కార్మికుడికి ఐటీ కోత 20 శాతం నుంచి 30 శాతం ఏరియర్స్, బోనస్ వంటి అదనపు ఆదాయంపై పన్ను పడింది. అందుకే బోనస్ లభించినప్పటికీ, ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
దేశంలోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా చూసి చలించారో అలా బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సైతం స్పందించాలి. దేశంలో బొగ్గు గనులు విస్తరించి ఉన్న తెలంగాణ, బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు వారి రాష్ర్టాల్లో బొగ్గు గని కార్మికులకు ఐటీ మినహాయింపుపై తీర్మానం చేయాలి. వారి ఎంపీల ద్వారా పార్లమెంటులో బిల్లు పెట్టించి పాస్ చేయించాలి. ఐటీ మినహాయింపునకు కృషి చేయాలి. కోల్‌బెల్ట్ ప్రాంతం, కోల్ ఇండియా విస్తరించిన ప్రాంతాల్లో ఎంపీలు ఒక్కటవ్వాలి. కేంద్రంపై పోరాడాలి.