హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బనకచర్లతోపాటు ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న కమిటీలో ఉండే సభ్యుల పేర్లు పంపాలని కేంద్రం ఇరు రాష్ర్టాలకు లేఖ రాసిం ది. నాడేమో రాష్ట్రాలు పేర్లను పంపితేనే తాము ఒక కమిటీ వేస్తామని చెప్పిన కేంద్రం నేడు ఏపీ ఒత్తిడితో మాట మార్చింది. త్వరగా పేర్లు పంపాలని కోరుతూ తెలంగాణపై ఒత్తిడి పెంచింది. ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని కొల్లగొట్టేందుకు అక్రమంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ అనుమతుల్లేకుండా, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నా రేవంత్‌రెడ్డి సరారు కిమ్మనడం లేదు. పైగా బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
దీంతో కేంద్ర జల్‌శక్తిశాఖ గత నెలలో ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో కొనసాగిన ఆ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ సీఎం బాబుతో భేటీ అయ్యారు. ఆ భేటీలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరగలేదని రేవంత్‌రెడ్డి వెల్లడించగా, అందుకు భిన్నంగా ఏపీ మంత్రి రామానాయుడు మాత్రం చర్చ జరిగిందని చెప్పారు. జల వివాదాల పరిషారానికి ఉన్నతాధికారుల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటుచేయాలని ఆ భేటీలో నిర్ణయించారు. ఈ సందర్భంగానే ఇరు రాష్ట్రాలు ఐదుగురు చొప్పున అధికారుల పేర్లను ప్రతిపాదించాలని, ఆ తరువాత కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి ఇద్దరు అధికారులతో కమిటీ వేస్తామని కేంద్రం కూడా ఈ సమావేశంలోనే వెల్లడించింది. గత భేటీలో ఇరు రాష్ట్రాల జల వివాదాల్లో తాము జోక్యం చేసుకోబోమని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టంచేసింది.
ఇరు రాష్ట్రాలు కమిటీ కోసం అధికారుల పేర్లను ప్రతిపాదించిన తరువాతనే తమ తరపున అధికారులను నిర్ణయించి కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. కానీ నేడు కేంద్రం అందుకు భిన్నంగా కమిటీ ఏర్పాటుకు పేర్లను పంపాలని హుకూం జారీ చేస్తున్నది. బనకచర్ల సహా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నదీజలాల వివాదాలపై ఏర్పాటు చేస్తామన్న కమిటీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తొందరపెడుతున్నది. ఈ మేరకు ఈ నెల 12నే రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ అగర్వాల్ వేర్వేరుగా లేఖలు రాసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఏపీకి దన్నుగా కేంద్ర జల్‌శక్తిశాఖ !
కేంద్రంలోని బీజేపీ సరారు ఏపీకి దన్నుగా నిలుస్తున్నది. నాడు తాము జోక్యం చేసుకోబోమని చెప్పి, నేడు అందుకు భిన్నంగా పేర్లను పంపాలని లేఖ రాసింది. ఏపీ సరారు ఇప్పటికే బనకచర్లతోపాటు, జల వివాదాల పరిషారం కోసం ఏర్పాటుచేసే కమిటీకి అధికారుల పేర్లను ఖరారు చేసింది. ఐదుగురు అధికారులతో కాకుండా ముగ్గురితో కమిటీ వేయాలని నిర్ణయించింది. ఇటీవలనే ఢిల్లీలో ప్రత్యేకంగా కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను ఏపీ నేతలు మరోసారి కలిసి కమిటీ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. ఏపీ ఒత్తిడితోనే తాజాగా కేంద్రం తెలంగాణకు లేఖ రాసినట్టు స్పష్టమవుతున్నది.