హనుమకొండ, డిసెంబర్ 6: రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నట్టు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే పాలన జరుగుతున్నదని చెప్పారు.
అంబేదర్ రాసిన రాజ్యాంగం వల్లే సీఎం, తాము మంత్రులుగా, నాయకులుగా ఉన్నామ ని అన్నారు. బాబా సాహెబ్ అంబేదర్ స్ఫూర్తితోనే కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం కేసీఆర్ తమ తో అంటుంటారని చెప్పారు. అంబేదర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎత్తేసేందుకు కుట్ర లు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఒక ఉద్యోగం కూడా ఇవ్వని కేంద్రం చేసే కుట్రలను వ్యతిరేకించాలని కోరా రు.
కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి ఆస్తిని, ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కొంతమంది కావాలని రాష్ట్రంపై చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.