హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవానికి హాజరైన సీతక్క మాట్లాడుతూ పదకొండేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దివ్యాంగుల పింఛన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.50 కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. వివిధ రంగాల్లో సత్తాచాటిన 21 మంది దివ్యాంగులను సీతక్క సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సొసైటీ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల సంక్షేమశాఖ సెక్రటరీ అనితారామచంద్రన్, డైరెక్టర్ శైలజ, జీఎం ప్రభంజన్‌రావు పాల్గొన్నారు.