
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కేంద్రం బీసీ కులగణన చేపట్టాలని ఎైక్సెజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. బీసీ గణనను చేయాలని అసెంబ్లీలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్‌కు బీసీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కులగణన చేయాలని ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలు, పలు రాష్ర్టాలు కూడా డిమాండ్ చేస్తున్నాయన్నారు. కేంద్రం కుల గణన చేయలేకపోతే ఆ అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. బీసీల కులగణన లేకపోవడంతో వారు అనేకరంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దాస్యం మాట్లాడుతూ.. బీసీ గణనపై సీఎం కేసీఆర్ బాట లో దేశం నడవాలని పిలుపునిచ్చారు. గణన ద్వారా బీసీలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. గణన ద్వారా బీసీలకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చెప్పారు.