హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ కార్యక్రమం చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. గత ఐదేండ్లలో రాష్ట్రంలో మలేరియా కేసులు 75 శాతం తగ్గిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించడం పల్లెప్రగతి సాధించిన విజయానికి నిదర్శనం. మలేరియా కేసులు 2016లో 3,152 నమోదు కాగా 2020లో వాటి సంఖ్య 870కి దిగివచ్చినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించడం విశేషం. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను సత్కరించనున్నది. మలేరియాతో పాటు టైఫాయిడ్, డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర అనేక సీజనల్ వ్యాధులకు అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు కారణమవుతున్నాయి.
ఈగలు, దోమలు, కీటకాలు సీజనల్ వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. పల్లెప్రగతి కార్యక్రమం ఈ సమస్యలను పరిష్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ లాంటివి సమకూర్చడంతో ఏరోజు చెత్తను ఆరోజే డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. రోడ్ల మీద మురుగునీరు, వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకొంటున్నారు. మురుగునీటి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. దీంతో దోమల వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, శుద్ధిచేసిన తాగునీరు సరఫరా అవుతున్నది. పల్లెల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పచ్చదనం, ఆహ్లాదం పెరిగింది. పల్లెప్రగతి కార్యక్రమం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెచ్చించిన రూ.8,880 కోట్లు ప్రజారోగ్య పరిరక్షణకు, జీవన ప్రమాణాలు పెరగడానికి బాటలువేశాయి. గ్రామీణ ప్రజలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషించాయి. గ్రామాలకు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వమూ నిధులను విడుదల చేయలేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ గ్రామాలకు ప్రతి నెలా విడుదలయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ప్రత్యేక శ్రద్ధ గ్రామీణ ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నది.
పల్లెప్రగతి కింద వివిధ కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు (రూ.కోట్లలో)