హైదరాబాద్, ఆగసు ్ట6 (నమస్తే తెలంగాణ) : చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువునా నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట వెన్నుపోటు పొడవగా, ఆ జీఎస్టీ పరిహారాన్ని చెల్లిస్తామన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తన హామీని విస్మరించింది. ఫలితంగా ఉత్పత్తులు, ఎగుమతులు తగ్గుతూ చేనేతరంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నది. భారత్ జోడో యాత్ర సందర్భంగా చేనేత సంఘాలతో రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా భేటీ అయి నేతన్నలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లిస్తామన్న భరోసా ఇచ్చారు. కానీ 20 నెలలు గడిచినా ఆ దిశగా రాష్ట్రంలో ఒక్క అడుగు పడలేదు. దీంతో చేనేత కార్మికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి చేనేతరంగం అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలే లేవు. గతంలో చిలుపల నూలుపై 9.2 శాతం సెన్‌వ్యాట్ పన్ను విధించి అనేక చేనేత వ్యతిరేక విధానాలను అవలంబించింది. 2014లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కళాకారులకు, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసింది. దీంతో చేనేత కళాకారులకు గొంతులేకుండా చేసింది. ప్రతి స్పిన్నింగ్ మిల్లు చేనేత కళాకారుల కోసం 40 శాతం చిలుపల నూలు ఉత్పత్తి చేయాలనే నిబంధన ఉండగా, దానిని 15 శాతానికి కుదించి మరో దెబ్బ కొట్టింది. ఇక అన్నింటికీ మించి చేనేత వస్త్రంపైనా పన్ను విధించింది. 2017 నుంచి జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 5 శాతం పన్ను విధించింది. ఆ పన్నును సైతం 12 శాతానికి పెంచాలని ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నది. జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు, సంఘాలు సుదీర్ఘకాలం నుంచి పోరాడుతున్నా ఫలితం దక్కడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా చేనేత సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద ఎత్తున కలిశారు. చేనేతపై జీఎస్టీని తొలగించేలా చొరవ చూపాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీ పన్నును పరిహారంగా చేనేత పరిశ్రమదారులకే చెల్లిస్తామని రాహుల్‌గాంధీ ఆనాడు హామీ ఇచ్చారు. దీంతో నేతన్నలు ఆనందం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 20 నెలలు కావస్తున్నా, ఆ హామీ అమలును కాంగ్రెస్ సర్కార్ విస్మరించింది. జీఎస్టీ పరిహారాన్ని చెల్లించి మాట నిలుపుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని చేనేత సంఘాల ప్రతినిధులు వివరిస్తున్నారు. రాహుల్‌గాంధీ హామీకే విలువలేకుండా పోయిందని మండిపడుతున్నారు.
2017లో జీఎస్టీ పన్నుల విధానం అమలులోకి వచ్చినప్పుడు రియల్, ఇమిటేషన్ జరీలపై 12 శాతంగా జీఎస్టీ పన్ను వేయాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారులు స్థానిక నాయకత్వం, గుజరాత్ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో రియల్ జరీ పన్నును 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. చేనేతపై ఆ 5శాతం జీఎస్టీని కూడా విధించవద్దని, జీరో జీఎస్టీ చేయాలని చేనేత కార్మిక సంఘాలు నాటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ గుజరాత్ సూరత్ వ్యాపారుల ఒత్తిడితో ఇమిటేషన్ జరీపై 12 శాతం జీఎస్టీ పన్నును కూడా 5 శాతానికి తగ్గించుకోవడం గమనార్హం.