సూర్యాపేట: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు(power privatization) కేంద్రం రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రధాని మోదీ( Prime Minister Modi) సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థల డిమాండ్ మేరకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తుందని విరుచుకు పడ్డారు. సూర్యాపేట కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగసంస్థలను తమ తాబేదారులకు కట్టబడుతుందని దుయ్యబట్టారు. మోదీ పాలనలో అనుచరులకు ప్రభుత్వ ఆస్తులు దోచి పెట్టడం మినహా సామాన్య ప్రజలకు ఒరగ బెట్టిందేమి లేదని ఆరోపించారు. బీజేపీ(Bjp) గల్లీ నాయకులు అవగాహన లేక అజ్ఞానంతో తప్పుడు ప్రచారానికి దిగ జారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టె ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చెప్పిన మాటలను మంత్రి మరోసారి ఉటంకించారు.
పెరిగిన డిమాండ్ కనుగుణంగా విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. మార్చి నెలలో ఉండే విద్యుత్ పీక్ 15,000 మెగావాట్ల డిమాండ్ ఫిబ్రవరి చివరివారంలో ఉందని అన్నారు. కేంద్రం, ఎన్టీసీపీ నిర్లక్ష్యం కారణంగా ఏర్పడ్డ విద్యుత్ సరఫరా లో అవరోధాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధిగమించామని స్పష్టం చేశారు. పెరుగుతున్న డిమాండ్ కనుగుణంగా విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు అవసరమైన ట్రాన్స్ మిషన్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూటరీ లైన్స్ సిద్ధం చేశామని వెల్లడించారు.