Telangana | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై మొదటినుంచీ కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. నిధుల కేటాయింపు, జాతీయ సంస్థల మంజూరు, ఆఖరుకు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల మంజూరు అంశాల్లోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది. ఇందుకు తెలంగాణకు చెందిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే నిదర్శనంగా నిలిచింది. కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించిన ప్రాజెక్టులకు అడ్డుచెప్పని కేంద్రం, తెలంగాణ ప్రాజెక్టుకు మాత్రం కుంటిసాకులు చెప్తూ అనుమతులను తిరస్కరిస్తూ వస్తున్నది. కేంద్రాన్ని నిలదీయకుండా, వాదనలను వినిపించకుండా కాంగ్రెస్ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. అనుమతుల సాధనను పూర్తిగా గాలికొదిలేసింది. రెండు జాతీయ పార్టీలూ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నాయి.
ఏడాదిన్నరగా పెండింగ్ పెట్టి తిరస్కరణ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) తెలంగాణ ప్రభుత్వం రూ.35 వేల కోట్ల అంచనాతో 2015లో శ్రీకా రం చుట్టింది. ప్రాజెక్టును ప్రారంభించగానే పొరుగున ఏపీతోపాటు, స్వరాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైనా కుట్రలకు తెరలేపారు. అయినా గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించారు. మైనర్ ఇరిగేషన్లో వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను మొత్తంగా 90 టీఎంసీల నికర జలాలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి 2022 సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి సమర్పించారు.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) అనుమతులకు 34వ సమావేశం నుంచే తీవ్ర ప్రయత్నాలు చేశారు. అనుమతులను ఈఏసీ తిరస్కరిస్తూ అనేక కొర్రీలతో పక్కనపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈఏసీ కోరిన విధంగా డాటాను సమర్పించడమేగాక, ప్రాజెక్టు పరిధిలోని కరువు పీడిత ప్రాంతాల పరిస్థితిని వివరించి ఒప్పించింది. దీంతో ఎట్టకేలకు 49వ ఈఏసీ అంగీకరించి అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ, దాదాపు ఏడాదిన్నర నుంచీ కేంద్రం జాప్యం చేస్తూ వచ్చింది. తీరా గత డిసెంబర్లో అప్రయిజల్ లిస్ట్ నుంచి పాలమూరు డీపీఆర్‌ను తొలగిస్తున్నట్టు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రాజెక్టు అంశంపై ప్రస్తుతం ట్రిబ్యునల్-2 ఎదుట విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
మరి ఆ ప్రాజెక్టులకు ఎలా ఇచ్చారు?
ట్రిబ్యునల్ విచారణను సాకుగా చూపుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులను కేంద్రం తిరస్కరిస్తున్నది. కానీ ట్రిబ్యునల్ అవార్డు అమలులోకి రాకముందే, న్యాయ వివాదాల్లో ఉండగానే కర్ణాటక, మహారాష్ట్ర చేపట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో కేంద్రం అనుమతులిచ్చింది. అప్పర్‌భద్ర, అప్పర్ కృష్ణ స్టేజ్-3 (ఆల్మట్టి), అప్పర్ తుంగతోపాటు, ఆ జాబితాలో మహారాష్ట్రకు చెందిన పదుల సంఖ్యలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులున్నాయి. ఇక అప్పర్‌భద్ర, అప్పర్‌తుంగ ప్రాజెక్టులదయితే మరీ దారుణం. ఆ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలంటూ కర్ణాటక బచావత్ ట్రిబ్యునల్-1 ఎదుట ప్రతిపాదించింది. కృష్ణాబేసిన్ తీవ్ర నీటి లోటు ఉన్న బేసిన్ అని ట్రిబ్యునల్ వెల్లడించింది. అదీగాక కృష్ణాకు తుంగభద్ర బేసిన్ నుంచే నిరంతరాయంగా నీరు రావాల్సి ఉన్నదని, తుంగభద్రపై ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ బేసిన్ నుంచి కృష్ణాకు నీటి రాక తగ్గిపోతుందని, ఫలితంగా దిగువనున్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే కే -8లోని తుంగభద్ర సబ్ బేసిన్, ఇతర బేసిన్లకు చేసిన నీటికేటాయింపుల్లో ట్రిబ్యునల్ అనేక మార్గదర్శకాలను సూచించింది. నీటి వినియోగంలో పరిమితులను విధించింది. ట్రిబ్యునల్-1 కర్ణాటకకు గంపగుత్తగా నీటిని కేటాయించినా తుంగభద్ర సబ్‌బేసిన్‌లో ఎక్కడెక్క డ.. ఎంత మొత్తంలో నీటిని వినియోగించుకోవాలనే అంశాలను ట్రిబ్యునల్-1 చాలా స్ప ష్టంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే అప్పర్‌భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్-1 ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. అయితే ట్రిబ్యునల్ గాని, దాని అనుమతితో ఏర్పాటైన అథారిటీ గాని తుంగభద్ర సబ్ బేసిన్లో మొత్తం నీటి లభ్యతపై అధ్యయనం చేసి అంచనా వేసిన తర్వాతే నీటిని కేటాయించాలని మాత్రమే ట్రిబ్యునల్- 1 నిర్దేశించింది.
బేసిన్ అవతలి ప్రాజెక్టులకూ అనుమతులు!
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్-1 అవార్డు గడువు ముగిసిపోవడం, ఆపై అవార్డులో నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీ కోసం 2004 ఏప్రిల్‌లోనే ట్రిబ్యునల్-2 ఏర్పాటైంది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ చైర్మన్‌గా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. కానీ 2005లో ఉమ్మడి ఏపీ సర్కారు చేపట్టిన, బేసిన్ అవతలి ప్రాజెక్టులకు సైతం కేంద్రం అనుమతులిచ్చింది. వైఎస్ జలయజ్ఞంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. కృష్ణాబేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు జలాలు మళ్లించే హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్), వెలిగొండ, మల్యాల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ చేపట్టారు. ఆయా ప్రాజెక్టులపై బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్ర సర్కార్లు ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాయి.