నాయబ్ తహసీల్దార్ అయిన ఆయన ఎందరో రైతుల సమస్యలు తీర్చారు. తన వద్దకు నిత్యం వచ్చే రైతుల సమస్యలను ఓపికగా వింటూ వారికి సాంత్వన చేకూర్చుతూ సంతృప్తి పొందుతుంటారు. కొన్ని సందర్భాల్లో రైతుల భూసమస్యలను తీర్చేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడికక్కడే సమస్యలను కొలిక్కి తెచ్చారు. స్వయాన రైతు అయిన ఆ అధికారికే అన్యాయం జరిగింది. తన పొలంలో పండిన ధాన్యం అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. అయినా తీరని వ్యథగానే ఆయన బాధ మిగిలింది.
కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మల్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన హరీశ్‌రావు ప్రస్తుతం వెల్గటూర్ మండలంలో నాయబ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. విధి నిర్వహణ తదుపరి హరీశ్‌రావు వ్యవసాయ పనులు చేస్తారు. కొడిమ్యాల, కొండాపూర్ గ్రామ రెవెన్యూ శివార్లలో ఉన్న 20 ఎకరాల వ్యవసాయ భూముల్లో వరి సాగుచేశారు. మేలో అకాల వర్షాలు పడటం, పొలంలో వర్షపు నీరు చేరడం వల్ల కొంత ఆలస్యంగా కోత కోశారు. ఆ మేరకు దశలవారీగా ధాన్యాన్ని కొడిమ్యాల మండలంలోని రామకిష్టాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి గత నెల 20, 23, 25, 27 తేదీల్లో చేర్చారు. 20న మొదటిసారి వచ్చినప్పుడు వీరి ధాన్యంతోపాటు కొనుగోలు కేంద్రంలో మరో 46 మంది రైతులకు చెందిన ధాన్యం ఉన్నది. వాటిని మాత్రమే తూకం వేసి కొనుగోలుదారులు హరీశ్‌రావుకు చెందిన ధాన్యం కుప్పలను మాత్రం అలానే వదిలేస్తూ వచ్చారు. తమ ధాన్యం ఎందుకు కొనడం లేదని కొనుగోలు కేంద్రంలో అడిగితే.. మీరే నేరుగా రైస్‌మిల్లర్ల వద్దకు వెళ్లి మాట్లాడుకోవాలని, వాళ్లు తీసుకోవడానికి ముందుకొస్తే తాము తూకం వేయిస్తామని చెప్పారు.
సదరు రైతు మిల్లర్ల వద్దకు వెళ్లి తన ధాన్యం తూకం వేయాలని విజ్ఞప్తి చేయగా.. మీరెందుకొచ్చారు? మాతో మీకు సంబంధమేంటి? కొనుగోలు కేంద్ర నిర్వాహకులకే చెప్పుకోవాలని చెప్పి పంపించారు. నేటికీ ఆ రైతు కుటుంబానికి చెందిన ఒక్క బస్తా కొనలేదు. సుమారు 800 క్వింటాళ్లు ధాన్యం అలాగే కొనుగోలు కేంద్రంలో ఉన్నది. తీరా చూస్తే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉండగానే సెంటర్ క్లోజ్ చేసినట్టు అధికారులు ప్రకటించడం ఇటు ప్రభుత్వం, అటు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నది. దీంతో ‘అకాల వర్షాలు పడ్డాయి. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం. రంగుమారినా, మొలకెత్తిన వడ్లను కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయి’ అంటూ మంత్రులు పదే పదే చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి.
ఈ ధాన్యం ఏంచేయాలి?
ఇప్పుడీ ధాన్యాన్ని ఏమిచేయంటారో అధికారులు, ప్రభుత్వం చెప్పాలి. అరుగాలం పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాను. అకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొంత దెబ్బతిన్నది. మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం కొంటామని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజనూ కొన్న తర్వాతే సెంటర్ క్లోజ్ చేస్తామని మంత్రులు, అధికారులు చెప్పిన మాటలు విని కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాం. ఇప్పుడు చూస్తే మా ధాన్యం కొనుకుండానే క్లోజ్ చేశారు. నాలాంటి ఒక హోదా ఉన్న అధికారికి ఇలా జరుగుతుందంటే కొనుగోలు కేంద్రాల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్న.
– హరీశ్‌రావు, రైతు (నాయబ్ తహసీల్దార్)