హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13(నమస్తే తెలంగాణ)/బేగంపేట : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబసమేతంగా పూజలు చేసి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి మహాహారతి, కుంకుమ, విశేష పుష్పార్చనలు చేశారు. పోతురాజుల నృత్యాలు, పులి వేషధారణలు, డప్పుకళాకారుల చప్పుళ్లతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. శివసత్తులు, జోగినులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.
ప్రముఖుల దర్శనం..
సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి పూజలు చేశారు. మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సీఎం వెంట ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో కలియతిరుగుతూ భక్తులను ఆప్యాయంగా పలుకరించి ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సాయంత్రం ఫలహారబండ్ల ఊరేగింపులోనూ భక్తులు ఇబ్బందిపడ్డారు.
నేడు రంగం, ఊరేగింపు..
సోమవారం రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. రెండోరోజు అమ్మవారి ఆలయంలో బలిపూజ, గావు పట్టడం నిర్వహిస్తారు. అనంతరం మాతాంగేశ్వరి ఆలయం ఎదుట ఓ పచ్చికుండపై స్వర్ణలత(జోగిని) దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జరగబోయే విషయాలపై భవిష్యవాణి చెప్పనున్నది. ఆ తర్వాత అమ్మవారిని అంబారీపై దేవాలయం చుట్టూ తిప్పి మెట్టుగూడలోని దేవాలయానికి సాగనంపనున్నారు.