Jamili Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాలపరిమితి ఐదేండ్లు ముగియడానికి ఆరు నెలల ముందుగానే సాధారణ ఎన్నికలను ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి (ఈసీ) ఉన్నదని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే నియమం వర్తిస్తుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టానికి లోబడి పార్లమెంట్‌కు, రాష్ర్టాల శాసనసభలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనన్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఏకకాల (జమిలి) ఎన్నికలపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
బీజేపీపాలిత రాష్ర్టాలు తప్ప కాంగ్రెస్ దాని మిత్ర పక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు ఏవి కూడా జమిలి ఎన్నికలను సమర్థించడం లేదు. విపక్ష కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బెంగాల్లో తృణమూల్, బీహార్‌లో జేడీయూ-ఆర్జేడీ, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్, తమిళనాడు డీఎంకే, కేరళలో సీపీఎం, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కర్ణాటకలో పరాజయం బీజేపీలో కల్లోలాన్ని సృష్టించిందా? ఏకకాల ఎన్నికలకు (జమిలి) వెళ్తేనే, రాష్ర్టాల్లో, కేంద్రంలో అధికారాన్ని తిరిగి చేపట్టవచ్చని బీజేపీ భావించిందా? ఇందులో భాగంగానే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చిందా? గడిచిన 3 నెలల్లో జరిగిన పరిణామాలను లోతుగా విశ్లేషిస్తే, ఇది నిజమేననిపిస్తున్నది. జమిలి ఎన్నికల అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో గతవారం కేంద్రం కమిటీ నియమించింది. అయితే, కర్ణాటక ఫలితాలు వెలువడిన వెంటనే.. ‘జమిలి’ కమిటీపై కోవింద్‌కు కేంద్రం సమాచారమిచ్చినట్టు తెలియడం రాజకీయ వర్గాల్లో కలకలాన్ని రేపింది. అంతేకాదు, కోవింద్ ఈ మూడు నెలల్లో పలు రాష్ర్టాల గవర్నర్లు, బీజేపీ, ఆరెస్సెస్ నేతలతో భేటీకావడం చర్చనీయాంశమైంది. దీనికితోడు బుధవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘ్వాల్.. కోవింద్‌తో దాదాపు గంటపాటు భేటీకావడం, ఇదే సమయంలో జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని సీఈసీ రాజీవ్ కుమార్ పరోక్షంగా సంకేతాలనివ్వడం గమనార్హం. కర్ణాటకలో వెల్లడైన ఫలితాలు, కేంద్రసర్కారుపై ప్రజల్లో ప్రస్తుతం ఉన్న తీవ్ర వ్యతిరేకత వెరసి జమిలి ఎన్నికలు నిర్వహిస్తేనే.. తిరిగి అధికారంలోకి రావొచ్చన్న నిర్ణయానికి బీజేపీ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, వ్యూహం ప్రకారం ఏకకాల ఎన్నికలను క్రమక్రమంగా తెరపైకి తీసుకొచ్చిందని చెబుతున్నారు.