హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని, అందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు సమాయత్తమవుతున్నామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్న సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలకు సంబంధించి ప్రజానాట్య మండలి(పీఎన్ఎం) రూపొందించిన పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో మతోన్మాద భావాలు ప్రజ్వరిల్లుతున్నాయని, వాటిని బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్‌పరివార్ వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించారు. వీరోచిత పోరాటానికి తెలంగాణ ప్రజలు ప్రతీక అని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించిన గొప్ప సంప్రదాయం ఇకడే ఉన్నదని గుర్తుచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జీ నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, చుక రాములు, టీ జ్యోతి, డీజీ నరసింహారావు, పీఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహ, ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మారన్న పాల్గొన్నారు.