Fedex | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడే ముఠాకు చెందిన సైబర్ నేరస్థుడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నిందితుడిపై 105 కేసులు నమోదు కాగా, 14 కేసులు తెలంగాణకు చెందినవిగా ఉన్నట్టు సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. జాయింట్ సీపీ రంగనాథ్ కథనం ప్రకారం.. ‘కొరియర్లో డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాలు సరఫరా చేస్తున్నారు.. మేం కస్టమ్స్ అధికారులం, మీపై కేసు నమోదైంది, సీబీఐ, ఆర్బీఐ అధికారులతో మాట్లాడాలి’ అంటూ బెదిరిస్తూ సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ ముఠాలతో చేయి కలిపిన జావెద్ నవాబ్ యాకుబ్‌ఖాన్ అనే వ్యక్తి వారికి బ్యాంకు ఖాతాలు సరఫరా చేసేవాడు. అమాయకుల నుంచి ఆయా ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తంలో 10 శాతం ఆయూబ్‌ఖాన్ కమీషన్‌గా తీసుకొనేవాడు. కవాడిగూడకు చెందిన వ్యక్తి కూడా ‘మీ పేరుతో పార్సిల్ వచ్చిం ది, మేం కస్టమ్స్, ఆర్బీఐ అధికారులమంటూ బెదిరించి రూ. 8,74,998 కాజేశారు. దీనిపై బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరిపారు. బాధితుడు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి, ఆ ఖాతా జావెద్ నవాబ్ యాకుబ్ఖాన్దిగా గుర్తిం చి అరెస్టుచేశారు. ఈ ఖాతాలో దేశవ్యాప్తంగా రూ.2.85 కోట్ల లావాదేవాలు జరిగినట్టు గుర్తించి ఖాతాను ఫ్రీజ్ చేశారు. నిందితుడిని అరెస్టుచేసి, కోర్టులో హాజరుపరిచారు.