ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్వాకం ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు మద్దతు ధర కల్పించి వారికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్పొరేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ అన్నదాతలను నష్టాలకు గురిచేస్తుంది. అదిలాబాద్ జిల్లాలో వానాకాలం సీజన్లో రైతులు నాలుగు లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా 40 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. అధికారులు జిల్లాలోని 9 మార్కెట్ యార్డులలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి క్వింటాలుకు రూ.4521 మద్దతు ధర ప్రకటించింది. అక్టోబర్ చివరి వారంలో పంట కొనుగోలు ప్రారంభం కాగా డిసెంబర్ నెలాఖరు వరకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేశారు. అయితే పంట నాణ్యత సరిగా రావడం లేదంటూ సీసీఐ అధికారులు రూ.100 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తాము నాణ్యమైన పంటను విక్రయానికి తీసుకువస్తున్నామని రైతులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పంటను సీసీఐకి విక్రయిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి పత్తికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.