ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జనవరి 8: ‘సీసీఐ అధికారులు.. దళారులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నరు. తేమ పేరిట కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నరు. మాకు న్యాయం చేయాలి’ అంటూ రైతులు బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుపూజ జిన్నింగ్ మిల్లు వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక జిన్నింగ్ మిల్లుకు అంకుషాపూర్‌కు చెందిన రైతు బుట్లే శంకర్ ట్రాక్టర్లో పత్తి తీసుకొచ్చాడు. సీసీఐ అధికారులు తేమశాతాన్ని పరీక్షించి ఎనిమిది శాతం ఉన్నట్టు తెలిపారు. ట్రాక్టర్‌ను సగం ఖాళీ చేశాక పకనే ఉన్న దళారీకి సంబంధించిన ఓ వ్యక్తి వచ్చి పత్తి నాణ్యత లేదని సీసీఐ అధికారులకు చెప్పడంతో వారు తిరస్కరిస్తున్నట్టు ఎంట్రీ పాస్‌పై రాశారు. దీంతోపాటు మరో నాలుగు వాహనాలను సైతం ఇదే కారణంతో తిరస్కరించారు. ఆపై దళారీ వచ్చి క్వింటాల్‌కు రూ. 6 వేల చొప్పున తీసుకుంటామని, లేదంటే పత్తిని ఇకడి నుంచి తీసుకెళ్లాలని అని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. అయినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక కన్నీరు పెట్టుకున్నారు. సీసీఐకి పత్తిని అమ్మేందుకు రెండు రోజులుగా రోజుకు రూ. 2 వేల చొప్పున ట్రాక్టర్ కిరాయి చెల్లించి క్యూలైన్లో వేచి ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.
ఎకడ అమ్మాలి?
రెండు రోజుల కింద 30 క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చిన. బుధవారం కాంటా పెట్టిన్రు. పత్తి నాణ్యత లేదని కొనుగోలు చేయమన్నరు. ఉట్టిగా ట్రాక్టర్ కిరాయి మీద పడ్డది. గిట్ల సీసీఐ నిరాకరిస్తే రైతులు పంట ఎకడ అమ్ముకోవాలి. – బుట్లే శంకర్, రైతు