హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి తన బావమరిది సృజన్‌రెడ్డితో కలిసి చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సిట్ విచారణకు వెళ్లే ముందు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి రాసిన లేఖను ఆయన మీడియా సాక్షిగా విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణి టెండర్లలో పాల్గొనడానికి ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారని తెలిపారు. ఈ విధానం సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ వంటి సంస్థలు కూడా దీన్ని అనుసరించడం లేదని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో తక్కువ ధరలకు (-7% నుండి -20% వరకు) ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానంలో అధిక ధరలకు (+7% నుండి +10% వరకు) కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని విమర్శించారు. దీని వల్ల సింగరేణికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతున్నదని మండిపడ్డారు.
సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు
గతంలో ఐవోసీఎల్ నుంచి నేరుగా బల్ డీజిల్ కొనుగోలు చేసే పద్ధతిని నిలిపివేసి, ఆ బాధ్యతను కాంట్రాక్టర్లకు బదిలీ చేశారని హరీశ్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగడమే కాకుండా, అదనంగా జీఎస్టీ భారం పడుతున్నదని, ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేండ్లుగా సింగరేణికి శాశ్వత సీఎండీ లేరని, కేవలం ఇన్‌చార్జ్‌తోనే నడుస్తున్నదని గుర్తుచేశారు. దీంతో పర్యవేక్షణ కరువై ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణి బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తంచేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. ఈ అక్రమాలపై అంతర్గత లేదా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిపోదని, కేవలం సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు. 2024 తర్వాత తీసుకున్న టెండర్లు, పాలసీ నిర్ణయాలన్నింటిపై దర్యాప్తు జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు.