హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెలంగాణకు వచ్చిన ఆయన.. దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. శనివారం ఆయన జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌ల సెమినార్లో పాల్గొనాల్సి ఉన్నది. ఆ క్రమంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన అలసట కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హుటాహుటిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందించారు.
అనంతరం ఆయన సాధారణ స్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, చికిత్స అనంతరం ఎప్పటిలాగే యాక్టివ్‌గా ఉన్నారని అపోలో హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. అస్వస్థత కారణంగా ఆయన తెలంగాణలో పాల్గొనాల్సిన కొన్ని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకే ఆయన తెలంగాణకు వచ్చారని ఓ వర్గం మీడియాలో కథనాలు రావడంతో అవన్నీ అవాస్తవాలేనని సీబీఐ వర్గాలు ఖండించాయి.