నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం పశువుల కాపరుల ప్రాణాల మీదకు తెచ్చింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతంలో ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకుపోయారు.
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో మూసీ ప్రాజెక్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం కేవలం సైరన్ మోగించి మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఇది తెలియని మూసీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాల పశువుల కాపరులు మేతకు, ఇసుక వ్యాపారులు వాగులో ఇసుక తీసేందుకు వెళ్లారు. గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వచ్చిన వరద వారిని చుట్టుముట్టింది. కేతపల్లి మండలం భీమారం వద్ద దిగువ ప్రాంతంలో ఒక్కసారిగా నీరు చేరడంతో మధ్యలో పశువుల కాపరులు గంగయ్య, బాలయ్య చిక్కుకుపోయారు.
వాగు మధ్యలో ఉన్న పెద్దబండ రాయిని ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మూడు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పశువుల కాపరులను పొక్లెయినర్ సాయంతో బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 20 బర్రెలతోపాటు ట్రాక్టర్ వరదలో కొట్టుకుపోయినట్టు సమాచారం.