హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ): కులగణనను అనవసరమైన ప్రశ్నలతో వివాదాస్పదం చేయొద్దని, ప్రత్యేక యాప్‌ను ద్వారా సరళతరమైన ప్రశ్నలతో ప్రజల వివరాలను పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ మగ్దూం భవనలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్థిక, రాజకీయ, సమానత్వం కలిగేలా కులగణన ఉండాలని సూచించారు. లగచర్ల దాడి ఘటన సరైంది కాదని, కానీ, రైతుల బాధను, ఆవేదనను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని హితవు పలికారు. దాడి చేశారనే నెపంతో ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి చర్యలు తీసుకోవద్దని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మూసీ, హైడ్రా విషయంలో ఈనెల 14న మేథావులతో రౌండ్ సమావేశం నిర్వహిస్తామని, దీనిలో చ ర్చించిన అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయనున్నట్టు కూనంనేని తెలిపారు.