హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తేతెలంగాణ) : ‘కులగణన కాంగ్రెస్ ఎన్నికల స్టంట్. బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకే హడావుడిగా సర్వేచేసి సెల్ఫ్‌గోల్ చేసుకున్నది. ఈ సర్వేతో సీఎం రేవంత్‌రెడ్డి చేసేదేమీలేదు. బలహీనవర్గాలకు ఒరిగేదేమీలేదు’ అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కులగణన, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అనేక అంశాలపై సవివరంగా సమాధానాలు ఇచ్చారు. తనదైన శైలిలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తగలబెట్టిన ఈ సర్వేకు ఏమాత్రం విలువలేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కులగణనను తప్పుబడుతున్నారని చెప్పారు. సర్వేకు వచ్చేవారికి వివరాలివ్వవద్దని గతంలో రేవంత్‌రెడ్డి చెప్పిన మేరకే తామూ వివరాలు ఇవ్వలేదని తెలిపారు. కానీ, ఆస్తుల వ్యవహారం బయటపడతాయనే భయంతోనే సర్వేలో పాల్గొనలేదని చిల్లర మాటలు మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు. ఎన్నికల ఆఫిడవిట్లో అన్ని వివరాలు ఉంటాయనే ఇంగితజ్ఞానం లేకుండా అసత్యాలు చెప్పడం సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లిందని విమర్శించారు. కులగణన నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయని సీఎంకు.. ఎస్కేఎస్ సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే బీసీల సంఖ్యను తగ్గించి చూపారని విమర్శించా రు. కులగణన తప్పుల తడకగా సాగింద ని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం తో ఉన్నారని, ఇప్పటికే మున్నూరుకాపులు, ముదిరాజ్‌లు, పద్మశాలీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, సన్నాలకు బోనస్ ఇస్తామని, పింఛన్లు పెంచుతామని, రైతుభరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మాట తప్పిందని మండిపడ్డారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతో చెప్పించిందని, కానీ ఏడాదిలో కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకే కాంగ్రెస్ సర్కార్ నియామకపత్రాలు ఇచ్చి తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఏడాదిలో 6 వేల ఉద్యోగాలిచ్చి ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ సర్కారుకే చెల్లిందని దుయ్యబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అవినీతే జరగలేదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కానీ, అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ధ్వజమెత్తారు. తనపై కూడా ఆరోపణలు చేసి బురద జల్లుతున్నారని ఆక్షేపించారు. విచారణ కమిషన్ ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు తాను సిద్ధమని స్పష్టంచేశారు. వారడిగే ప్రతి ప్రశ్నకు సవివరంగా సమాధానాలు చెప్తానని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ సర్కారు బెదిరింపులకు బీఆర్ఎస్ ఎప్పటికీ భయపడబోదని చెప్పారు.