మహబూబ్ నగర్ : ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వశ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా నేటికి అక్కడక్కడ ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనం, అసాంఘికంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.
గురువారం వెబెక్స్ వీడియో కాన్ఫ రెన్సు ద్వారా నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మంత్రి హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు.
ముఖ్యంగా భూమి తగాదాలు, ఇతర విషయాలకు సంబంధించి నమోదైన కేసులపై తక్షణ నివేదికలు ఇవ్వాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ గత సమావేశాల్లో చర్చించిన విషయాలన్నింటిని మరొకసారి సమీక్షించి, సమీక్ష తర్వాత వాటికి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రికి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసుల విషయంలో మాత్రమే కాకుండా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సైతం అధికారులు కృషి చేయాల్సి ఉందన్నారు. వ్యక్తిగత రుణాలు, ఆయా పథకాల కింద లబ్ధి పొందడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను సుమోటోగా తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులు లాభం పడేలా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలన్నారు.