గంగాధర, మే 31: ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించినందుకు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 23న రాత్రి అధికార పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్ చిత్రామిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సందర్శించారు. అక్కడి సమస్యలను పలువురు రైతులు వారి దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే, అధికారులు వెళ్లిపోయిన తర్వాత కేంద్రం నిర్వాహకురాలు నిర్మలారెడ్డి ఎనిమిది మంది రైతులు తనతో అసభ్యంగా మాట్లాడారని గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామానికి చెందిన ఎండీ జాకీర్, ఎండీ నజీర్, కాట్నపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తోడేటి అనిల్, అన్నాడి దామోదర్‌రెడ్డి, జాగిరి రవి, జడ మహిపాల్, జడ వేణుపై సెక్షన్ 79, 126(2), 292, 351 కింద కేసు నమోదు చేశారు.
విచారణ లేకుండానే..
నిజానికి కొనుగోలులో జాప్యాన్ని మాత్ర మే రైతులు అధికారుల దృష్టికి తెచ్చినట్టు తెలుస్తున్నది. ఒకవేళ అధికారులు ఇబ్బందు లు పడేలా రైతులు మాట్లాడి ఉంటే.. ఫిర్యా దు చేయాల్సింది అధికారులు గానీ.. సెంటర్ నిర్వాహకురాలు కాదు కదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఫిర్యాదు అందిన తర్వాత ఎటువంటి విచారణ చేయకుండానే రైతులపై కేసులు నమోదు చేయడం చూస్తే.. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నా యి. నిర్వాహకురాలు ఫిర్యాదు చేసిన విష యం రెండు రోజుల తర్వాత దృష్టికి రావడం తో సదరు రైతులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సెంటర్ నిర్వాహకురాలి ఫిర్యాదు నిరాధారమైందని, విచారణ చేపట్టాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. కొనుగోలు కేంద్రం విషయంలో చాలా రోజులుగా ఇరువర్గాల మధ్య గొడవలు నడుస్తున్నట్టు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ పీఎస్‌కు పిలువలేదని తెలిపారు.
వడ్లు కొనమంటే కేసులా?
రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఎస్సై వంశీకృష్ణతో మాట్లాడారు. రైతులపై పెట్టిన కేసుల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో ఫోన్లో మాట్లాడగా, రైతులపై నమోదైన కేసుల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వారికి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని, రిమాండ్ వరకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సుంకె తెలిపారు. రైతుల సమస్యలను తీర్చాల్సిన ఎమ్మెల్యే సత్యం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని మండిపడ్డారు.