హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యామండలి గుర్తింపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ అఫిలియేషన్ లేకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి, అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. విద్యాశాఖ అదేశాలను పాటించని ఇటువంటి అనధికార కళాశాలలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ..
ఆదిత్య డిగ్రీ, ఆదిత్య బిజినెస్ కళాశాలలకు ఓయూ, ఉన్నత విద్యామండలి నుంచి ఎటువంటి అనుమతులు లేవని, ఈ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని ఈ నెల 4న ఓయూ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. అయినప్పటికీ ఆదిత్య యాజమాన్యం ఈ నెల 6న నాగోల్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో అడ్మిషన్లు కోరుతూ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఏ కళాశాలలైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డ్డి తెలిపారు.