హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ‘ప్రజాపాలన’ సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రశ్నించే గొంతులను నొకేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండేండ్ల రేవంత్‌రెడ్డి పాలనలో మీడియా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారింది. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇటు డిజిటల్ మీడియా రెండింటి మీద దాడులు, అక్రమ కేసులు సర్వసాధారణంగా మారాయి. నమస్తే తెలంగాణ పత్రిక మీద, టీన్యూస్ చానల్ మీద అనేక అక్రమ కేసులు పెట్టించారు. 24 నెలల పాలనలో 20 మందికిపైగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు. కొందరిని జైలుకు కూడా పంపించారు. ఈ-పేపర్, యూట్యూబ్ చానళ్లు నిర్వహించే జర్నలిస్టులపై కేసులు పెట్టి అరెస్టు చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్.. మరోవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులపైనా గురిపెట్టింది.
మంత్రి, అధికారులపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారనే అభియోగంతో ఎన్టీవీ సీనియర్ పాత్రికేయులు దొంతు రమేశ్, సుధీర్, పరిపూర్ణాచారిని అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన ఘటన కొన్ని వెలుగులోకి రాగా, బయటకు వెలుగుచూడని బెదిరింపు ఘటనలు అనేకం ఉంటాయని జర్నలిస్టు సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత ధోరణి ఇప్పు డు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఇటీవల కాలంలో జర్నలిస్టుల అరెస్టులు జరుగుతున్న తీరు దారుణంగా ఉన్నది. తీవ్రవాదులను పట్టుకున్నట్టుగా, అర్ధరాత్రి వేళల్లో జర్నలిస్టుల ఇండ్లపై పటాలంతో వెళ్లి పోలీసులు దాడులు చేయడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు పరాకాష్టగా నిలిచింది. కుటుంబసభ్యులను బెదిరిస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
1) 2023 డిసెంబర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలివారంలోనే శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సచివాలయంలోనే సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేశారు. ‘ఎన్నటికైనా నా చేతిలోనే చస్తావ్.. ఎప్పుడైనా నేనే నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీవీ డిబేట్లో శ్రీనివాస్‌రెడ్డి మెదక్ సీటు విషయంలో పలు విశ్లేషణలు చేశారు. ‘నా గురించి ఏం మాట్లాడినవురా..ఎన్నటికైనా నా చేతిలోనే చస్తావ్..?’ అని సచివాలయంలోనే రోహిత్ బెదిరించారు. పలు అభియోగాలతో సిద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపైనే కేసులు నమోదు చేశారు. వేధింపులకు గురిచేశారు.
2)2024 ఆగస్టు: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రా మం కొండారెడ్డిపల్లిలో రైతులతో మాట్లాడి వాస్తవాలకు ప్రజల ముందు పెట్టేందుకు ఇద్ద రు మహిళా జర్నలిస్టులు విజయారెడ్డి, సరిత ప్రయత్నించారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్త లు జర్నలిస్టుల కెమెరాలు, ఫోన్లు లాక్కున్నా రు. వారిని బురదలోకి నెట్టేశారు. ఫోన్లు విసిరేసుకుంటూ వెకిలి ఆట ఆడారు. పదుల సం ఖ్యలో కార్లతో వారిని చేజ్ చేశారు. పోలీసుల కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పైగా ఉల్టా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
3) 2024 సెప్టెంబర్: కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆగడాల గురించి నిజాలను వీడియో రూపంలో చెప్పిన ఎస్ఆర్టీవీ జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్‌రెడ్డి మీద దాడి చేయడంతోపాటు అక్రమ కేసులు పెట్టి, అరెస్టు కూడా చేయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల ఆగడాల గురించి ప్రజలకు తెలియజేస్తే అరెస్టు చేసి భయపెడుతారా? జైలుకు పంపుతారా? అని నాడు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబసభ్యులు ప్రశ్నించారు.
4) 2024 అక్టోబర్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నానని ‘యూ న్యూస్’ యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు తనపై కాంగ్రెస్ మూకలు దాడిచేసినట్టు ఆయన ఆరోపించారు.
5) 2024 నవంబర్: వైఆర్ టీవీ జర్నలిస్ట్ యార రంజిత్‌రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేశారనే అభియోగంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు.
6) 2025 ఫిబ్రవరి: ఆర్జీ టీవీ జర్నలిస్ట్ రాజ్‌కుమార్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన ఓ యువకుడు ఇటీవల తమకు పథకాలు అందడం లేదని ఆర్జీ టీవీతో మాట్లాడుతూ వాపోయాడు. ఈ వీడియో ప్రసారం చేసినందుకు అక్రమ కేసులు పెట్టి వేధించారని రాజ్‌కుమార్ ఆరోపించారు.
7) 2025 మార్చి: న్యూస్‌లైన్ పేరుతో యూట్యూబ్ చానల్, తెలంగాణం పేరుతో ఆన్లైన్ పేపర్ నిర్వహిస్తున్న జర్నలిస్ట్ శంకర్‌పై కొందరు దుండగులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. వివిధ అభియోగాలతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ నేతలు అసైన్డ్ భూములు లాక్కుంటున్నారనే వార్తలు రాసిన నేపథ్యంలో తనపై అక్రమ కేసులు నమోదుచేసినట్టు శంకర్ మీడియాకు వెల్లడించారు.
8) 2025 మార్చి: రేవంత్‌రెడ్డి పాలనపై కడుపు మండిన ఓ వృద్ధ రైతు తిట్ల దండకం అందుకున్నారు. ఆ వీడియో ప్రసారం చేసిన పల్స్ న్యూస్ ఎండీ రేవతి, రిపోర్టర్ తన్వీయాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 రోజులు రిమాండ్‌కు తరలించారు.
9) 2025 మే: సిగ్నల్ టీవీ శివారెడ్డిపై వివిధ అభియోగాలతో మూడు కేసులు నమోదు చేశారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నాయకుడు రామ్మోహన్‌రెడ్డి అనుచరుల ఫిర్యాదుతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని శివారెడ్డి ఆరోపించారు.
10) 2026 జనవరి: మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేశారనే అభియోగంపై ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేశ్, సుధీర్, పరిపూర్ణాచారిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని అరెస్టు చేశారు.
మహిళా జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నైతికతకు తిలోదకాలిస్తున్న తీరు అమానవీయంగా ఉన్నది. అర్ధరాత్రి సమయాల్లో వారి ఇండ్లలోకి ప్రవేశించి అరెస్టులు చేయడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలుస్తున్నది. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుపై జరిగిన దాడి, కాంగ్రెస్ హయాంలో మీడియా ప్రతినిధులకు రక్షణ లేదనే విషయం స్పష్టంచేస్తున్నది. కేవలం వార్తలు సేకరించినందుకో, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకో జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ‘కలం పట్టిన చేతికి సంకెళ్లు వేయడం ద్వారా నిజాన్ని దాచలేరు. ఇది కేవలం మీడియాపై దాడి మాత్రమే కాదు, సామాన్య ప్రజల గొంతుకపై జరుగుతున్న దాడి’గా జర్నలిస్ట్ సంఘాలు అభివర్ణించాయి.