KTR | కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఇవాళ, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మండల మరియు జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపనున్నాయి. ఈ క్రమంలో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు ఇతర నిరసన రూపాల్లో నిరసనలకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. బీజేపీ-కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నదని తెలిపారు.
సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడని నిలదీశారు. దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకమని.. వాళ్ళు చేస్తున్న కుట్రనే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని తెలిపారు. బెదిరింపులు కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని స్పష్టం చేశారు.