హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి స్వగ్రామానికి చెందిన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదని, అది సీఎం సోదరులు చేసిన హత్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్షకట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టంచేసిన నేపథ్యంలో ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఎనుముల బ్రదర్స్‌పై పోలీసులు కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య. ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో 40 ఏండ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖాన నిర్మించడమే కాకుండా.. సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది అరాచక పాలన
‘రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్‌గా పనిచేసి ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పో యి, 85 ఏండ్ల్ల పెద్దాయన అని కూడా చూడకుండా కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకే చివరికి పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఇటీవల సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండను దేశం మరిచిపోకముందే.. సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే రాష్ట్రం లో సీఎం, ఆయన సోదరుల అరాచకాలకు అంతేలేకుండా పోయిందని స్పష్టమవుతున్నది. ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
గోడకట్టి ఏం సాధించారు? : నిరంజన్‌రెడ్డి
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రమా? కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం, రేవంత్ కుటుంబం బాధ్యత వహించాలి. గోటితోపోయే సమస్యలను గొడ్డలిదాకా తెస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న సాయిరెడ్డి ఇంటికి దారిలేకుండా గోడకట్టి ఏం సాధించారు? సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన వారందరి మీదా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పాలనలో మనుషుల ప్రాణాలకు, వారి ఆకాంక్షలకు విలువ లేకుండా పోయింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
కన్నుమిన్ను కానని అహంకారం: దాసోజు ఆగ్రహం
‘మాజీ సర్పంచ్ సాయిరెడ్డి బలవన్మరణం.. రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుల రాక్షస మనస్తత్వానికి నిదర్శనం’ అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కన్నుమిన్నుకానని అహంకారంతో ప్రజాపాలన పేరుమీద నిరంకుశ పాలన కొనసాగిస్తున్న నియంత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి’ అని ధ్వజమెత్తారు. తమ స్వగ్రామంలో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకొనే బలీయమైన పరిస్థితులు కల్పించడం సీఎం సోదరుల రాక్షస మనస్తత్వానికి, నేర ప్రవృత్తికి నిదర్శనం. సాయిరెడ్డి సూసైడ్ నోట్ ఆధారంగా రేవంత్‌రెడ్డితోసహా ఆయన సోదరులపై ఆత్మహత్యా ప్రేరేపణ సెక్షన్ 108, భారత న్యాయ సంహిత ఆధారంగా కేసు నమోదు చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి’ అని శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఎనుముల బ్రదర్స్‌పై హత్యకేసు పెట్టాలి: హరీశ్‌రావు
మాజీ సర్పంచ్‌ను ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఎనుముల బ్రదర్స్‌పై హత్యకేసు పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ‘కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం. రేవంత్.. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు ఉసిగొల్పిన వాళ్లపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమా? మీ అన్నదమ్ముల అరాచకాలు శ్రుతి మించాయనేందుకు ఇది నిదర్శనం కాదా? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ములపై హత్యా నేరం పెట్టాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.