హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరీక్షలు పారదర్శకంగా జరిగాయని నెటిజన్లు మెచ్చుకుంటుండగా, ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ హయాంలో అవకతవకలను ఎత్తి చూపుతున్నారు. అప్పడు, ఇప్పుడు ఉన్న తేడాలను పలువురు పోల్చి చూసుకుంటున్నారు. ‘సత్యమేవ జయతే’ అంటూ సోషల్‌మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. గ్రూప్-1 పరీక్షలపై జరిగిన అక్రమాలను, తప్పిదాలను ఈనాటి కాంగ్రెస్ సర్కారు దాచి ఉంచింది. పైగా ఎలాంటి తప్పిదాలు జరగలేదని దబాయించింది. ప్రశ్నించిన నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీలను ప్రయోగించింది. కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేసింది. ‘మాదే కరెక్టు.. మీదంతా తప్పు’ అంటూ వాదించింది. కాంగ్రెస్ నేత మానవతారాయ్ సహా మరికొందరైతే నిరుద్యోగులపై నోరుపారేసుకున్నారు.
‘గ్రూప్ -1 మెయిన్స్ పేపర్లను రీ వాల్యుయేషన్ చేయించాలని అడిగితే చెప్పుతో కొడతాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సందు దొరికినప్పుడల్లా సర్కారు పెద్దలు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం.. యూపీఎస్సీ తరహాలో కమిషన్‌ను పటిష్టం చేశామని గొప్పలు చెప్పుకున్నారు. టీజీపీఎస్సీని ఎంతమేరకు పటిష్టం చేశారో మంగళవారం నాటి తీర్పులో కోర్టు వెలువరించిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మెయిన్స్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రత లోపించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థతతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత విలువైన సమయాన్ని వృథా అయిందని కోర్టు వ్యాఖ్యానించింది. మూల్యాంకనంలో పాటించాల్సిన పద్ధతులను పాటించడంతో కమిషన్ విఫలమైందని పేర్కొన్నది.
గ్రూప్ -1పై కేసు పెట్టిందే ఆనాటి సర్కార్
గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కారు పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీచేసింది. అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. ఉద్యమంలా ఉద్యోగాలను భర్తీచేసింది. గతంలో ఉద్యోగాల భర్తీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు. దీనికి కేసీఆర్ సర్కారే చెక్ పెట్టింది. ఓటీఆర్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రైమరీ కీ వెల్లడించడం, అభ్యంతరాలను స్వీకరించడం, ఫైనల్ కీ విడుదల చేయడం, ఆ తర్వాతే తుది ఫలితాలను ప్రకటించే పద్ధతిని బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టింది. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పటిష్టం చేసింది. గతంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాకంతో గ్రూప్-1 పేపర్ లీకేజీ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బీఆర్ఎస్ సర్కారు దాచలేదు. దబాయించనూలేదు. ప్రభుత్వమే స్వయంగా కేసును నమోదు చేసింది.
దీంతోనే లీకేజీ విషయం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు దాచి, దబాయించే ప్రయత్నం చేస్తే అసలు పేపర్ లీకేజీయే బయటికొచ్చేది కాదు. సిట్ ద్వారా విచారణ జరిపించింది. ఎవరినీ వదలకుండా అన్నిస్థాయిల్లో విచారణ జరిపించింది. నిందితులు, బాధ్యులను వదిలిపెట్టలేదు. నెలల తరబడి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరపడమే కాకుండా, విచారణ ఏ దశలో ఉన్నదో ఎప్పటికప్పుడు బయటపెట్టింది. ఎక్కడా గోప్యతను పాటించలేదు. బాధ్యులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ విషయంలో బీఆర్ఎస్ పాత్ర ఏమీ లేకపోయినా ప్రతిపక్షాలు రాజకీయంగా గ్రూప్-1ను వాడుకున్నాయి. నిందలేశాయి. కానీ ఇప్పుడు అదే గ్రూప్-1 మెయిన్స్‌లో అనేక లోపాలున్నట్టు ఆరోపణలు వచ్చినా కాంగ్రెస్ దాచి, దబాయించింది. మొత్తంగా మెయిన్స్‌లోని లోపాలను గుర్తించిన కోర్టు ఫలితాలను ఏకంగా రద్దుచేసింది.