సుబేదారి, జూన్ 13 : ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ వివాహితకు చుక్కలు చూపించాడు. భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ ముప్పుతిప్పలుపెట్టాడు. అతడి అరాచకాన్ని భరించలేని బాధితురాలు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ‘ఖాకీ’చకుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌పై శనివారం హనుమకొండ పీఎస్‌లో కేసు నమోదైంది.
బాధితురాలి ఫిర్యాదు, హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతుండగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి పాప ఉంది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2022 మార్చిలో హనుమకొండ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. అప్పుడు ఎస్సైగా పనిచేస్తున్న గోదారి రాజ్‌కుమార్ న్యాయం చేస్తానని నమ్మించి, అతడికి తెలిసిన న్యాయవాదితో భర్తతో విడాకులు ఇప్పించాడు.
అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తానని ఫోన్లో మాట్లాడుతూ లొంగదీసుకున్నాడు. ఔటర్‌రింగ్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి, లైంగికదాడికి పాల్పడి, న్యూడ్ ఫొటోలు తీశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హనుమకొండలోని లాడ్జిల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండుసార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు రావడంతో, న్యూడ్ ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టించి పరువు తీస్తానని బెదిరించాడు.
వారం క్రితం హనుమకొండలో ఆమె పనిచేసే దవాఖాన నుంచి లాడ్జికి తీసుకువెళ్లి మద్యం మత్తులో లైంగికదాడి చేశాడు. నువ్వు ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు.. నేనూ పెళ్లి చేసుకోను.. ఇలానే కలిసి ఉందామని బెదిరించి, బీర్ బాటిల్‌తో కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. దీంతో రాజ్‌కుమార్ అతడి కారులో బాధితురాలిని ఆమె ఇంటి వద్ద దింపేసి వెళ్లాడు. ఎస్సై రాజ్‌కుమార్ లైంగికదాడి, వేధింపులను భరించలేక బాధితురాలు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఐజీని కలిసి ఫిర్యాదు చేసింది.
ఐజీ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు బాధితురాలిని ప్రాథమిక విచారణ కోసం శనివారం వరంగల్ భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ మహిళా ఇన్స్పెక్టర్ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకొని హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు పంపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై రాజ్‌కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు హనుమకొండ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. ఎస్సై రాజ్‌కుమార్ హనుమకొండ నుంచి ఎల్కతుర్తికి బదిలీ అయిన తర్వాత ఏడాదిన్నర క్రితం అవినీతి కారణాలతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.