హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఓ మైనర్ బాధితురాలిగా ఉన్న కేసులో ఆమె హనీట్రాప్‌నకు పాల్పడిందనే ప్రశ్నే తలెత్తదని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘ సేవకురాలు సునీతాకృష్ణన్ తెలిపారు. కేంద్ర మంత్రి బండి కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసులో లీగల్ ఫ్యాక్ట్స్ ఇవే అంటూ మంగళవారం ఆమె ‘ఎక్స్’ వేదికగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ విషయంలో పిల్లల సమ్మతి అనే ప్రశ్న వర్తించదని వివరించారు. బాలికల తల్లిదండ్రులు కిడ్నాప్, బలాత్కారం కేసులు పెట్టడంతో పరస్పర అంగీకారంతో పారిపోయిన టీనేజ్‌లపై సైతం పోక్సో కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జువెనైల్ యాక్ట్ 2015లోని సెక్షన్ 74 ప్రకారం 18 ఏండ్లలోపు పిల్లల గుర్తింపును గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని ఆమె వివరించారు. దీన్ని ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.