మాదాపూర్, సెప్టెంబర్ 10 : కూలీనాలీ చేసుకుంటూ నివాసముంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా గుడిసెలు ఖాళీ చేయించి వాటిని కూలగొట్టడమే కాకుండా బాధితులపై హైడ్రా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కండ్లెదుటే తమ గుడిసెలను కూలగొడుతుంటే కడుపుమండి బాధితులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కూల్చివేతలకు ఆటంకం కలిగించారంటూ వీరిపై నార్త్ట్యాంక్ డివిజన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు బాధితులపై 132 రెడ్విత్ 4(5), బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
మాదాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల పేరిట భవనాలు, షెడ్లు, గుడిసెలను గత ఆదివారం హైడ్రా కూల్చివేసింది. కూలీ పనిచేసుకునేవారు చాల మంది షెడ్లు, గుడిసెల్లో బతుకుతున్నారు. ఉదయం 5 గంటలకు హైడ్రా బుల్డోజర్లు సున్నం చెరువు వద్దకు చేరుకున్నాయి. గంట సేపట్లో ఇండ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హుకుం జారీచేసి వాటిలో ఉన్నవారందరినీ రోడ్డుపైకి తెచ్చారు. తమను రోడ్డుపై పడేశారంటూ వెంకటేశ్, లక్ష్మి దంపతులు, డ్రైవర్గా పనిచేసే సురేశ్ తమ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. తమ కుటుంబం రోడ్డున పడడంతో తీవ్ర ఆవేదన చెందిన బాధితులు, ఇల్లు కూలిపోయిందనే బాధలో ఉంటే హైడ్రా అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ వారిపై ఫిర్యాదు చేయడం విమర్శలకు దారితీస్తున్నది. పెద్దల జోలికి వెళ్లని హైడ్రా, కూలీలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నదంటూ పలువురు మండిపడుతున్నారు.
ఎంత సిగ్గుచేటు! : కేటీఆర్
ఇండ్లు కూల్చుతున్నారన్న బాధతో అడ్డుకున్నవారిపైనే కేసులు పెట్టిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘ఉన్న ఒక్క గూటినీ మీ బుల్డోజర్ ప్రభుత్వం కూల్చివేస్తే.. కడుపు మండి, కన్నీళ్లతో పెట్రోల్ పోసుకున్నందుకు కేసులు పెడుతారా? ఎంత సిగ్గు చేటు! ఎంతటి నీతిమాలిన చర్య!’ అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీది ప్రజా ప్రభుత్వమో, ప్రజాపాలనో కాదు రేవంత్రెడ్డి గారూ! మీరు నడుపుతున్నది బుల్డోజర్ ప్రభుత్వం.. కేసుల రాజ్యం’ అంటూ ధ్వజమెత్తారు. ‘బుల్డోజర్ మీ అన్న ఇంటి మీదికి, పొంగులేటి నిర్మాణాల మీదికి పోతుందా?’ అని నిలదీశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, తమ పార్టీ లీగల్ టీమ్ బాధితులను సంప్రదించి తగిన సహకారాన్ని అందిస్తుందని చెప్పారు.
హైడ్రాకు 23 మంది పోలీస్ సిబ్బంది
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 23 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను హైడ్రాకు కేటాయిస్తూ శాంతి భధ్రతల డీజీ మహేశ్ భగవత్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీళ్లు డిప్యూటేషన్, అటాచ్మెంట్లపై హైడ్రాలో విధులు నిర్వర్తించనున్నారు. కేటాయించిన వారిలో 15 మంది ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఆర్ఐలు, ఇద్దరు ఆర్ ఎస్సైలు, ముగ్గురు ఎస్సైలు ఉన్నారు.