Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో రైతులపై కేసులు పెట్టారు. పంట కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగినందుకు ముగ్గురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు ఈ నెల 22వ తేదీన చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. కల్లాల్లో కాంటాలు వేసి 55 దాటినా బస్తాలను ఇంకా తరలించడం లేదని, కొందరు అధికారులు అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు కొమ్ముకాస్తూ వారు చెప్పిన వారికే లారీలను పంపిస్తున్నారని ఆరోపించారు. ట్రక్ షీట్లు ఇవ్వకుండా మిగిలిన రైతులను సొసైటీ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు వేసి ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి సరుకును తరలించేందుకు లారీలను పంపించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
అయితే, మొక్కజొన్న పంట కొనుగోలు చేసి, తరలించి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం దాన్ని విస్మరించింది. ఉల్టా రైతులపైనే కేసు పెట్టింది. అధికారుల విధులకు ఆటంకం కలగించారని పొనుగోటి రత్నాకర్, సీతయ్య, ఆకుల చంద్రయ్య అనే రైతులపై కేసు నమోదు చేశారు.