Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావని మండిపడ్డారు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడమని విమర్శించారు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించారని మండిపడ్డారు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగనని తెలిపారు.