మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో నమోదు
యూపీ ఓటర్లను బెదిరించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం
ప్రెస్మీట్లు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణపై నిషేధం
హైదరాబాద్/అబిడ్స్, ఫిబ్రవరి 19 : హైదరాబాద్‌లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శనివారం ఆదేశాలు జారీచేసింది. మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్‌పై 72 గంటలపాటు నిషేధం విధించింది. ప్రజాప్రతినిధిగా ఉండి బాధ్యాతారహితంగా మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరించడం ద్వారా చట్టాలను, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన రాజాసింగ్‌పై ఎందుకు చర్యలు చేపట్టకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. అయినా గడువులోగా రాజాసింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. దీంతో రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు సీఐ రవికుమార్ తెలిపారు.