హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్‌పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ తయారు చేసిన పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై ఉరుకులు పరుగుల మీద స్పందిస్తున్న పోలీసులు, సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కిక్కురుమనడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు చేసినా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేసిందీ లేదు.. కేసు పెట్టిందీ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్‌పై ఫార్ములా-ఈ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలనుకున్న ప్రభుత్వ పాచిక పారకపోవడంతో ఇప్పుడు పక్క దారులు వెతుకుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కడ వీలైతే అక్కడ కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిసింది. కేటీఆర్‌పై ఎంత ఎక్కువ వీలైతే అన్ని కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి పోలీస్ బాస్‌లకు ఆదేశాలు అందినట్టు చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగానే తిట్టుకాని తిట్టు పేరుతో కేసు నమోదు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘ఒక చిల్లర గాడు ఇవాళ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ. ఏం చేద్దాం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటాడు. కాళేశ్వరం అంటే ఈ సన్నాసికి తెలియదు. నల్లగొండకు వెళ్లి గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. కాళేశ్వరం లేకుంటే గంధమల్ల ఎక్కడిది రా హౌలా’ ఇలా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ తిట్టినట్టు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌వి తిట్లయితే మరి సీఎం రేవంత్‌రెడ్డి బూతు పురాణాన్ని ఏమనాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘నా కొడుకుని పండవెట్టి తొక్కి పేగులు మెడలేసుకుంటా, సన్నాసోడా, సవట, దద్దమ్మ, దివానాగా, సన్నాసి, రండ, హౌలా, మార్చురీకి పోతడు’ ఇదీ పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వాడిన జుగుప్సాకరమైన భాష! కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా కేసీఆర్ మరణాన్ని కోరుకునేలా ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘స్ట్రెచర్ నుంచి మార్చురీకి పోతరు, నీ చరిత్ర ఫౌమ్హౌస్లోనే శాశ్వతంగా సమాధి అయిపోతుంది’ అంటూ కేసీఆర్ మరణాన్ని కాంక్షించే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. సీఎం వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి శైలిపై రాష్ట్రమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమమయ్యాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తిట్లయితే.. సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చేసిన వ్యాఖ్యలు భక్తి ప్రవచనాలా? అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పలు సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరికైనా రోత పుడుతుంది. కానీ పోలీసులకు మాత్రం చీమకుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తిట్టినవి తిట్లు కావు.. ఆయనపై కేసులు లేవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేటీఆర్ వాడుక భాషగా మాట్లాడిన మాటలనే తిట్లుగా ఫిర్యాదు చేస్తే.. ఆగమేఘాలపై కదిలి.. కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వేగాన్ని ప్రతిపక్ష పార్టీ నేతల ఫిర్యాదుపై ఎందుకు చూపడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ను ఉద్దేశించి అన్ని తిట్లు తిట్టిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసులేవని పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తిట్ల ఆధారంగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యేవని అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారిపై ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. అదే సమయంలో అధికార పార్టీ నేతలపై ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదలు బుట్టదాఖలు చేస్తున్న పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీకి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ బాల్క సుమన్ తదితరులు నిరుడు నవంబర్ 9న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటి వరకు చర్యల్లేవు. మొన్నటి మార్చిలో కేసీఆర్‌ను ఉద్దేశించి స్ట్రెచర్ నుంచి మార్చురీకి పోతరు అంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపైనా పోలీసుల స్పందన లేదు. సీఎంపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. ఇలా పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులను పోలీసులు బుట్టదాఖలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ‘టార్గెట్ బీఆర్ఎస్ నేతలు’ అన్నట్టుగా నడుస్తున్నదనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సరే తుమ్మితే కేసు.. దగ్గితే కేసు.. ప్రజల తరఫున ప్రశ్నిస్తే కేసు.. రైతుల తరఫున నిలదీస్తే కేసు.. విద్యార్థుల తరఫున పోరాడితే కేసు.. ఇలా సందర్భం ఏదైనా సరే బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. కేటీఆర్, హరీశ్‌రావు, జోగినపల్లి సంతోశ్‌కుమార్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మన్నె క్రిశాంక్, పాడి కౌశిక్‌రెడ్డి, కొణతం దిలీప్, క్రాంతి కిరణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బాల్కసుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జైసింహా, మన్నె గోవర్ధన్ ఇలా పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలపై చిన్నచిన్న కారణాలతో కేసులు నమోదు చేశారు. మన్నె క్రిశాంక్ ఒక్కడిపైనే 11 నెల్లలో 11 కేసులకు పైగా నమోదు చేశారంటే పోలీసుల తీరు ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద నేతల నుంచి మొదలు చిన్నస్థాయి నేతల వరకు సుమారు 200 మంది బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.
‘చేయని నేరానికి ఫార్ములా – ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై తప్పుడు కేసు పెట్టారు. నోటీసుల మీద నోటీసులు పంపుతున్నరు. ఎక్కడ పడితే అక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నరు. మరి ఫార్ములా-ఈ రేస్ రద్దుతో రాష్ర్టానికి రావాల్సిన వేల కోట్ల ఆదాయానికి గండిపడ్దదని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఫిర్యాదు దారును విచారించకుండానే కేసును మూసివేయడంలో అంతర్యమేంటి? అంటే సామాన్యులకు ఓ రూలు..సీఎంకు మరో రూలా?’ అని శనివారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. ముఖ్యమంత్రి, హోమంత్రిపై కేసు పెట్టవద్దని బీఎన్ఎస్ చట్టంలో ఎక్కడైనా ఉన్నదా? ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడినా, అనరాని మాటలన్నా స్పందించని పోలీసులు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి నిలదీశారు. కేటీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమున్నదని, రేవంత్ బూతులతో పోల్చితే అవి చాలా చిన్నవని పేర్కొన్నారు. నాడు పీసీసీ చీఫ్‌గా, నేడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ చేసిన దారుణమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని గుర్తుచేశారు. పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా కేసీఆర్‌ను ఉద్దేశించి ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారోనని చెప్పారు. ఆయన వయసును గౌరవించకుండా నీచమైన భాషను ప్రయోగించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.