నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణ ఉద్యమంలో రైల్‌రోకో కార్యక్రమంలో ప్రయాణికులు, రైలు సిబ్బందికి ఇబ్బందులు కల్పించారని కేసీఆర్‌తోపాటు, పలువురిపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఉత్తర్వులు వెలువడగా, ఈ మేరకు కేసీఆర్‌పై కేసును కొట్టివేయాలని ప్రజాప్రతినిధుల కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు జారీచేసిన ఉత్తర్వు ప్రతిని న్యాయవాది లక్ష్మణ్ సమర్పించగా, ఉత్తర్వు ఆధారంగా కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 14 ఏండ్ల అనంతరం కేసీఆర్‌పై కేసును తొలగించడం హర్షణీయమని న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు.