నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారి మనోభావాలు దెబ్బతినేలా చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టివేసింది. దర్యాప్తు అధికారితోపాటు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సీఎంపై నేరం రుజువుకాలేదని జడ్జి శ్రీదేవి పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మీర్ విరాసత్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మల్ పోలీసుస్టేషన్లో 2023లో ఈ కేసు నమోదైంది. సెక్షన్లు 294-బీ, 189, 506 ప్రకారం నిర్మల్ పోలీసులు చార్జిషీట్‌ను దాఖలుచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చేసిన అనుచిత వాఖ్యలవల్ల పోలీసుల మనోభావాలు దెబ్బతిన్న్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును ఇటీవల నిర్మల్ పోలీసుసేష్టన్ నుంచి బేగంబజారుకు బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.