KTR | రాజకీయ జీవితంలో ప్రతిరోజూ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య గడుపుతున్న తమకు ఇలాంటి ఆహ్లాదకరమైన సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు పాత జ్ఞాపకాలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తాయని చెప్పారు.
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవ సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం. నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా కార్టూనిస్టుల పాత్రపై మాట్లాడిన కేటీఆర్.. ‘ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం’ అనే సూక్తిని ప్రస్తావిస్తూ, సమాజం, రాజకీయాలపై కార్టూన్లు చూపే ప్రభావం ఎంతో గొప్పదని అన్నారు. భారతదేశంలో ఆర్.కే. లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హాబ్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తెలుగులో ఈనాడు శ్రీధర్, సాక్షి శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను ప్రశంసించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనవేనని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి అవసరమని పేర్కొన్నారు. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని కేటీఆర్ అన్నారు. కళను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు తప్పనిసరి అని పేర్కొంటూ, ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని చెప్పారు.
ఆయన స్మారకార్థం అవార్డులను అందించడం అభినందనీయం..
శేఖర్ కుటుంబ సభ్యులు, మిత్రులు గత ఆరేళ్లుగా ఆయన స్మారకార్థం అవార్డులను అందించడం అభినందనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కార్టూనిస్టుగా శేఖర్ విశిష్ట సేవలు అందించారని, సమకాలీన అంశాలపై ఆయన వేసిన కార్టూన్లు ప్రత్యేక గుర్తింపు పొందాయని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన గీసిన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాయని, ఆయన ప్రస్థానం నేటి తరం కార్టూనిస్టులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
శేఖర్‌ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాకపోయినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదమైన రోజున గన్‌పార్క్‌కు వెళ్లి తెలంగాణ సాధనను చూసి ఆనందించిన సంఘటన తనను ఎంతో కదిలించిందని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. జూన్ 2, 2014కు ముందే ఆయన మరణించడం దురదృష్టకరమన్నారు.
వచ్చే ఏడాది నుంచి శేఖర్ మెమోరియల్ అవార్డులను మరింత ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్‌కు బదులుగా రవీంద్రభారతిలో మరింత వైభవంగా కార్యక్రమం నిర్వహించేలా అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. కళాకారులు, రచయితలు సమాజానికి అందిస్తున్న సేవలను ఎల్లప్పుడూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డులు కళాకారులకు స్ఫూర్తి.. కళను ప్రోత్సహించడం సమాజ బాధ్యత: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా… pic.twitter.com/EWGgv1mDNe
— BRS Party (@BRSparty) July 19, 2026